Electricity Department : విద్యుత్ శాఖలో పోస్టింగ్ @ రూ. 30 లక్షలు ?

యాదాద్రి భువనగిరి జిల్లాలోని విద్యుత్ శాఖ ( ఆపరేషన్)లో డివిజన్ స్థాయిలోని ఓ అధికారి పోస్ట్ కు @30 లక్షల రూపాయలు ఒక బడా కాంట్రాక్టర్ ముడుపులు తీసుకొని పోస్టింగ్ ఇప్పించినట్లు జిల్లా వ్యాప్తంగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

Update: 2024-10-30 07:47 GMT

దిశ, ఆలేరు : యాదాద్రి భువనగిరి జిల్లాలోని విద్యుత్ శాఖ ( ఆపరేషన్)లో డివిజన్ స్థాయిలోని ఓ అధికారి పోస్ట్ కు @30 లక్షల రూపాయలు ఒక బడా కాంట్రాక్టర్ ముడుపులు తీసుకొని పోస్టింగ్ ఇప్పించినట్లు జిల్లా వ్యాప్తంగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ అధికారి పోస్టింగ్ వ్యవహారంలో ఒక కాంట్రాక్టర్ చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ కాంట్రాక్టరే సంబంధిత అధికారికి పోస్టింగ్ తానే స్వయంగా ఇప్పించానని ఇక నేను చెప్పిందే వేదమని తాను ప్రచారం చేసుకుంటున్నాడు!!.

అదేవిధంగా ఆ అధికారి సామాజిక వర్గం, ఆ కాంట్రాక్టర్ సామాజిక వర్గం ఒక్కటే కావడంతోనే పోస్టింగ్ పట్టుబట్టి మరి ఇప్పిచ్చినట్లు సదరు కాంట్రాక్టర్ తన తోటి కాంట్రాక్టర్ల వద్ద గొప్పలు చెప్పుకోవడం విశేషం. ఈ అధికారి పోస్టింగ్ విషయంలో సదరు కాంట్రాక్టర్ రూ. 30 లక్షలు అధికారి వద్ద తీసుకొని నల్లగొండ పట్టణంలో విధులు నిర్వహిస్తున్న ఆ అధికారిని భువనగిరికి ట్రాన్స్ఫర్ చేయించడంలో చాలా రిస్క్ తీసుకున్నట్లు, ఆ కాంట్రాక్టర్ ప్రచారం చేసుకోవడం శోచనీయం. విద్యుత్ శాఖలోని ఒక అధికారి పోస్టింగ్ కు రూ. 30 లక్షలు ముడుపుల ఆరోపణలు గుప్పుమనడంతో విద్యుత్ శాఖలో సంస్థలో ఏ మేరకు అవినీతి జరుగుతుందో ఈ అధికారి పోస్టుతో బట్టబయలవుతుందని ప్రజలు అనుకుంటున్నారు.

గతంలో కూడా ప్రచారం చేసి ఏసీబీకి పట్టించిన కాంట్రాక్టర్..

గత కొద్ది సంవత్సరాల క్రితం పైన పేర్కొన్న కాంట్రాక్టర్ డివిజన్ స్థాయిలోని ఒక అధికారికి పోస్టింగ్ తానే ఇప్పించానని భువనగిరి డివిజన్ వ్యాప్తంగా జోరుగా ప్రచారం చేసుకున్నాడు. ఆ తర్వాత అధికారి తన మాట వినలేదని, తాను చేసే తప్పుడు పనులకు సహకరించలేదని నేపంతో విద్యుత్ శాఖ ఉన్నతాధికారిని ఏసీబీకి పట్టించాడు. ప్రస్తుతం ఈ అధికారిని కూడా తానే తీసుకు వచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నాడని ఈ అధికారిని కూడా చివరికి ఏం చేస్తాడోనని విద్యత్ శాఖలోని అధికారులు, కాంట్రాక్టర్లు చర్చించుకుంటున్నట్లు సమాచారం.

తప్పుడు పనులకు సహకరించాలని ఒత్తిడి..

తాను చేసినతప్పుడు పనులకు సహకరించాలని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోని జిల్లా స్థాయి ప్రథమ, ద్వితీయ శ్రేణి నాయకులు పేరు చెప్పుకొని అధికారుల పై ఒత్తిడి తెస్తాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్ శాఖలో ఆయన చేసిన కాంట్రాక్టు పనుల పై విచారణ సంస్థ (విజిలెన్స్ ) అధికారులతో విచారణకు ఆదేశీస్తే అతను చేసిన తప్పులు బహిర్గతం అవుతాయని ప్రజల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు భువనగిరి డివిజన్ లో ఒక అధికారి పోస్టింగ్ విషయంలో రూ.30 లక్షలు చేతులు మారినట్టు వస్తున్న ఆరోపణల పై విచారణకు ఆదేశించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News