కదం తొక్కిన పేదలు.. ఇళ్ల స్థలాల కోసం ఐదేళ్లుగా పోరాటం

నేరేడుచర్లలో 243,244 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిరుపేదలు గత కొన్నేళ్లుగా పోరాడుతున్నారు.

Update: 2023-05-22 04:10 GMT

దిశ, నేరేడుచర్ల: నేరేడుచర్లలో 243,244 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిరుపేదలు గత కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. ఆర్డీవో, ఎమ్మార్వోతోపాటు ఎమ్మెల్యే, ఎంపీలకు వినతి పత్రాలు అందించినా స్పందించలేదు. దీంతో గత 87 రోజులుగా దీక్షలు చేపడుతున్నా పాలకులు, అధికారులు స్పందించకపోవడంతో విసుగుచెందిన నిరుపేదలు ఐక్యంగా కదం తొక్కారు. శనివారం రాత్రి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని తాత్కాలికంగా గుడిసెలు వేసుకున్నారు. గుడిసెలు తొలగించేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. ప్రాణాలైనా వదులుకుంటాం కాని ఇక్కడి నుంచి కదలమని హెచ్చరించడంతో అధికారులు వెనుదిరిగారు.

నేరేడుచర్ల పట్టణంలో రెవెన్యూ సర్వేనెంబర్ 243 , 244 గల ప్రభుత్వ భూమిని ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని గత కొన్నేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు స్పందించకపోవడంతో ఫిబ్రవరి 28 నుంచి నిన్నటి వరకు (శనివారం) నేరేడుచర్ల పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద నిరుపేద సంఘం పేరుతో 83 రోజులు ధర్నా చేపట్టారు. తమకు సొంత ఇండ్లు లేవని తమకు ఇండ్లను నిర్మాణం జరుపుకొంటానికి ఇంటి స్థలాలను కేటాయించాలని జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో తోపాటు ఎమ్మెల్యే ఎంపీలకు కూడా వినతి పత్రాలను అందించారు.

అయినా ఎవరూ స్పందించకపోవడంతో ఆ ప్రభుత్వ భూములను శనివారం రాత్రి సుమారు 200 మంది పేదలు స్వాధీనం చేసుకొని గుడిసె వేసుకున్నారు. చీరలతో చుట్టూ హద్దు బంధాలను ఏర్పాటు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న నేరేడుచర్ల తహశీల్దార్ సరిత తమ సిబ్బందితో పాటు వెళ్లి నిరుపేదలు స్వాధీనపరుచుకునేందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చీరలను, గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న మహిళలు తహశీల్దార్ ను అడ్డుకున్నారు. ప్రాణాలైనా వదులుకుంటాము గాని భూమిని వదులుకోమని చెప్పడంతో తహసీల్దార్ తిరిగి వెళ్లిపోయారు.

వివిధ పార్టీల నాయకుల మద్దతు

నిరుపేదల సంఘం ఆధ్వర్యంలో 83 రోజులు చేపట్టిన దీక్షకు జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్ ,బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్ రెడ్డి , సీపీఐ పార్టీ రాష్ట్ర నాయకులు గన్నా చంద్రశేఖర్ రావు, బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాంబశివ గౌడ్‌తోపాటు నేరేడుచర్లకు చెందిన అన్ని పార్టీల నాయకులు నిరాహార దీక్షలో కూర్చొని మద్దతు తెలిపారు .

కూలి డబ్బులు ఇంటి కిరాయికి సరిపోతున్నాయి

గత 50 సంవత్సరాల నుంచి నేరేడుచర్ల పట్టణంలోని కిరాయి ఇంట్లో ఉంటున్నాను. కూలి పనులతోపాటు కుండలమ్ముకుంటూ జీవిస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు వారి పెళ్లిళ్లు అయ్యాయి. వారు కూడా కిరాయి ఇండ్లల్లోనే ఉంటున్నారు. కూలి పనులకు వెళ్లగా వచ్చిన డబ్బులలో కిరాయికి కొంత పోతుంది. గత మూడు నెలల నుంచి ఎండలోనే దీక్ష చేపడుతున్నాము.

- వడాల లక్ష్మమ్మ నేరేడుచర్ల.

30 ఏళ్ల నుంచి కిరాయికే ఉంటున్నాం

గత 30 ఏళ్ల నుంచి నేరేడుచర్ల పట్టణంలో కిరాయి ఇండ్లలోనే జీవిస్తున్నాను. పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఆయమ్మగా పనిచేస్తున్నాను. వారిచ్చే కొద్దిపాటి జీతంలో కిరాయికే సగం వరకు పోతుంది. ప్రభుత్వం కనీసం ఖాళీ జాగ ఇస్తే గుడిసె వేసుకొని జీవిస్తాం.

- సయ్యద్ షకీనా బేగం

ఆ భూములు కోర్టులో పెండింగులో ఉన్నాయి..

నిరుపేదలమని గుడిసెలు వేసి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్న సర్వే నెంబరు 243, 244 గల ప్రభుత్వ జబామి కోర్టులో పెండింగులో ఉంది. కోర్టు పెండింగులో ఉన్నందున ఆ ఆ భూములు పంపిణీ చేయడానికి వీలులేదు. పేదలమని గుడిసేలు వేసుకొన్న విషయాన్ని ఉన్నత అధికారుల తెలియపరిచాను. వారి ఆదేశాల ప్రకారం వారు తీసుకొనే నిర్ణయాలను బట్టి నడుచుకుంటాను.

-నేరేడుచర్ల తహశీల్దార్ సరిత

Read More:  మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ స్థలంలో అక్రమ నిర్మాణం 

Tags:    

Similar News