నయా ట్రెండ్ కు తెరదీసిన నారాయణపురం తహశీల్దార్ ?
ప్రభుత్వానికి ఆదాయం పెంచేలా పనిచేయాల్సిన ఉద్యోగులే బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహకరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
దిశ, సంస్థాన్ నారాయణపురం : ప్రభుత్వానికి ఆదాయం పెంచేలా పనిచేయాల్సిన ఉద్యోగులే బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహకరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కాసులు ఇస్తే చాలు ఏ పనైనా ఇట్టే చేసేస్తామనే నైజంతో కొందరు అధికారులు పనిచేయడం రాష్ట్రంలో చాలా చోట్ల ఏసీబీకి పట్టుబడుతున్న ఉదంతాలే సాక్ష్యం. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండికొట్టే పనులు ఏ ఉద్యోగి అయినా తన సొంత లాభం చూసుకుంటే తప్ప చేయడు అనేది జగమెరిగిన సత్యం.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం రెవెన్యూ పరిధిలో మహమ్మద్ షఫీ అనే వ్యక్తి సర్వే నెంబర్ 414 లో సుమారు రెండు ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. అయితే సదరు వ్యక్తి మొదటగా 414 సర్వే నెంబర్ లో సబ్ డివిజన్ తో ఉన్న 20 గుంటల భూమిలో ఒక్కోసారి తన ఇష్టానుసారంగా ఒకటి, రెండు గుంటలకు నాలా కన్వర్షన్ తీసుకున్నారు. సదరు వ్యక్తికి 20 గుంటల భూమి ఒకేసారి నాలా కన్వర్షన్ ఆర్డర్ ఇవ్వాల్సిన తహశీల్దార్ వివిధ రోజుల్లో అతనికి నచ్చిన విధంగా ఒకటి, రెండు గుంటలకు నాలా కన్వర్షన్ ఆర్డర్ ఇచ్చాడు. ఇలా సదరు సర్వేనెంబర్ లోని సుమారు ఎకరం భూమి వరకు నారాయణపురం తహశీల్దార్ షఫీ అనే వ్యక్తికి నాలా కన్వర్షన్ ఆర్డర్ ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యమేమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
నయా ట్రెండ్ !
గతంలో రియల్టర్లు డీటీపీసీ అప్రూవల్ తీసుకొని లీగల్ గా వెంచర్ నిర్మాణం చేస్తే భారీగా ఖర్చు వస్తుందని తహశీల్దార్లతో కుమ్మక్కై గుంటలుగా భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయించేవారు. అయితే యాదాద్రి జిల్లాలో గతంలో 'దిశ' ఇలాంటి దందాపై కొన్ని కథనాలను రాసింది. ఆ సందర్భంలో జిల్లా కలెక్టర్ జిల్లాలో ఫామ్ ల్యాండ్ ల రిజిస్ట్రేషన్ పూర్తిగా నిషేధించింది. అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు తహశీల్దార్లు ఎవరు వాటి జోలికి కూడా వెళ్లలేదు. అయితే నారాయణపురం తహశీల్దార్ మాత్రం ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఇతరులకు ఒక్కో గుంట రిజిస్ట్రేషన్ చేయడం వల్ల సమాచారం బయటకు పొక్కుతుందని అనుకున్నారో ఏమో కొత్తగా ఆలోచన చేశారు. నారాయణపురం రెవెన్యూ పరిధిలోని సదరు వ్యక్తిపై ఉన్న 20 గుంటల భూమిని ఒకేసారి నాలా కన్వర్షన్ ఆర్డర్ ఇవ్వకుండా రియల్టరుకు నచ్చిన విధంగా ఒకే వ్యక్తి పై గుంటల్లో వివిధ సందర్భాల్లో నాలా కన్వర్షన్ ఆర్డర్ ఇచ్చి అందరికీ కొత్త పాఠాన్ని నేర్పారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి ?
ఓ వ్యక్తి పై ఉన్న వ్యవసాయ భూమి పూర్తి విస్తీర్ణాన్ని ఒకేసారి వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు ఎన్నో నిబంధనలు పెట్టే తహశీల్దారులు ఇలా ఒకే వ్యక్తి పై పలుమార్లు గుంటలుగా వ్యవసాయేతర భూమిగా ఎలాంటి స్వలాభం లేకుండానే మార్చారా అంటే అనుమానం కలగక మానదు. ఉదాహరణకు ఒక వ్యక్తి పై ఎకరం వ్యవసాయ భూమి ఉంటే దాన్ని వ్యవసాయేతర భూమిగా మార్చితే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మొత్తం విస్తీర్ణాన్ని గజాల్లో మాత్రమే మరో వ్యక్తి పేరు పైకి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకవేళ సదరు భూమిని కొన్ని గజాలుగా (ప్లాట్లుగా) విక్రయించాలంటే మాత్రం కచ్చితంగా డీటీపీసీ నుంచి అనుమతి తీసుకుని రోడ్లు, డ్రైనేజీ వంటి వసతులను కల్పించడంతో పాటు గ్రామపంచాయతీకి 10% ల్యాండ్ ను మార్ట్ గేజ్ చేయవలసి ఉంటుంది. ఇదంతా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని అనుకున్న రియల్టర్, తహశీల్దార్ లు ఎవరికి అనుమానం కలగకుండా కొత్త ఆలోచనకు పూనుకున్నారు.
ఒకటి, రెండు గుంటలను వేరువేరుగా వ్యవసాయేతర భూమిగా మార్చడంతో ఎలాంటి ఖర్చు లేకుండానే ఇతరులకు ప్లాట్లను విక్రయించవచ్చు అనే ఆలోచనకు తెరలేపారు. అంటే తహశీల్దార్, సదరు రియల్టర్ చేసిన నిర్వాకం వల్ల గ్రామపంచాయతీకి రావలసిన ఆదాయం గండిపడడమే కాకుండా భవిష్యత్తులో ఇక్కడ ఫ్లాట్లను కొన్న ప్రజలు కూడా ఇబ్బందులు పడక తప్పదు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేటప్పుడు సదరు భూమిలో ఏమైనా కాలువలు ఉన్నాయా ఇంకేమైనా వారసత్వ కట్టడాలు ఉన్నాయా అని పరిశీలించాల్సిన తహశీల్దార్ అవేమీ చూడకుండా గుట్టుచప్పుడు కాకుండా ఈ తతంగాన్ని ముగించారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ నిర్వహించి బాధ్యులైన తహసిల్దార్ పై చర్యలు తీసుకోవడంతో పాటు సదరు భూమిలోని రిజిస్ట్రేషన్ లను నిలిపి వేసేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.
స్లాట్ బుక్ అయితే ఆపే అధికారం లేదు.. ఎం.కృష్ణ, నారాయణపురం తహశీల్దార్..
స్లాట్ బుక్ అయితే ఆపే అధికారం లేదు అందుకే నాలా కన్వర్షన్ చేశాను. దీంతో ప్రభుత్వానికి మూడు శాతం ఆదాయం అదనంగా వస్తుంది.