Nagarjuna Sagar: సాగర తీరంలో అద్భుత దృశ్యం.. బిరబిరా కృష్ణమ్మ పరవళ్లు

ఆకాశంలో అరుదుగా కనిపించే అద్భుత దృశ్యం నాగార్జునసాగర్ డ్యామ్‌పై ఆవిష్కృతమైంది.

Update: 2024-09-02 05:01 GMT

దిశ, నాగార్జునసాగర్‌: ఆకాశంలో అరుదుగా కనిపించే అద్భుత దృశ్యం నాగార్జునసాగర్ డ్యామ్‌పై ఆవిష్కృతమైంది. రంగుల హరివిల్లు పర్యాటకులు కనువిందు చేసింది. పిల్లలు, పెద్దలు ఆ కమనీయ దృశ్యాన్ని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ డ్యామ్‌ 26 క్రస్ట్‌ గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో ప్రకృతి అందాలు పర్యాటకులను రా రమ్మని పిలుస్తాయి. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయానికి రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండుకుండలా తలపిస్తుండడంతో అక్కడి ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే సాగర్ క్రస్ట్‌ గేట్ల ద్వారా జాలువారుతున్న కృష్ణమ్మ జల సవ్వడులను పర్యాటకులు వీక్షిస్తూ సెల్ఫీలు, ఫొటోలు కెమెరాలు బంధిస్తున్నారు. దీంతో సాగర్ జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 5,42,279 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 5,42,279 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 588.90 అడుగులకు చేరింది. దీంతో సాగర్ డ్యామ్ అధికారులు అప్రమత్తమై సాగర్ 26 క్రస్ట్ గేట్లలో 6 గేట్లను 10 అడుగుల మేర, 20 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి 5,06,248 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 2019‌లో ప్రాజెక్టుకు 7,50,000 క్యూసెక్కుల గరిష్ట స్థాయిలో వరద నీరు రాగా ఐదేళ్ల తరువాత నేడు 5,00,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. గంట గంటకు వరద ఉధృ‌తి పెరుగుతుండడంతో డ్యామ్ అధికారులు గేట్ల అడుగులు పెంచుతూ.. సాగర్ జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

అదేవిధంగా సాగర్ ప్రాంత రైతులను, ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని రెవెన్యూ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా భద్రత చర్యలు చేపడుతూ స్థానిక అధికారులను 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. పర్యాటకులకు ఏలాంటి ఇబ్బంది కలిగినా 100కు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ వెల్లడించారు.

 


Similar News