Sagar-Srisailam tour : చలో నల్లమల.. ఊగే అలల పై ప్రయాణం..

అందాల అల నల్లమల.. ఆ పేరు వింటేనే అభయారణ్యంతో పాటు అడవి అందాలు గుర్తుకొస్తాయి.

Update: 2024-10-27 02:13 GMT

దిశ, నాగార్జున సాగర్ : అందాల అల నల్లమల.. ఆ పేరు వింటేనే అభయారణ్యంతో పాటు అడవి అందాలు గుర్తుకొస్తాయి. ఆ ప్రాంతమే నేడు పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకోబోతుంది. పోటీ ప్రపంచంతో కుస్తీ పట్టి విసిగిపోయి.. అలసిపోయిన పట్టణజనం సెలవుదినాల్లో ఈ ప్రాంతంలో గడపడానికి అత్యంత మక్కువ చూపుతున్నారు. ఇక్కడ జలజల పారే సెలయేళ్ళు.. పక్షుల కిలకిల రాగాలు చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. పవిత్ర పుణ్యక్షేత్రాలు.. నాటి శిల్పకళను తెలియజేసే ఎంతో సుందరమైన కట్టడాలు ఆధ్యాత్మికను నింపుతాయి. కనుచూపుమేర పచ్చదనం.. నింగిని తాకుతున్నట్లుగా కనిపించే అరుదైన వృక్షాలు ఆహ్లాదపరుస్తాయి. నల్లమల్ల ఒక‌వైపు బిరా బిరా కృష్ణ‌మ్మ ప‌రుగులు… మ‌రోవైపు ద‌ట్ట‌మైన అడ‌విత‌ల్లి అందాలు.. ప్ర‌కృతి ప్రేమికుల‌కు త‌నివితీర‌ని నేటి సమాజంలో సమయాన్ని బిజీ బిజీగా గడిపేస్తున్నాం. కానీ వీకెండ్‌ మాత్రం కుటుంబ సభ్యులు, స్ర్నేహితులతో గడపాలని ప్లాన్‌ వేసుకుంటాం. ఆరోజు వారితో గడిపే క్షణాల కోసం వారమంతా ఎదురుచూస్తాం. అయితే వారితో గడిపేందుకు హైదరాబాద్‌ లోని దగ్గరలో ఉండే ఏదైనా టూరిస్టు స్పాట్ లను వెతుకుతుంటాము. అలాంటి వారికోసం తెలంగాణ టూరిజం శాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది

అందాల నల్లమల... ఆస్వాదించేద్దామిలా..

పచ్చని కొండలు, కృష్ణమ్మ పరవళ్లు, దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం గుండా ఆహ్లాదకరంగా సాగే నాగార్జునసాగర్‌ - శ్రీశైలం లాంచీ ( Sagar-Srisailam tour ) ప్రయాణం ఎటుచూసినా పచ్చని కొండల మధ్యలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ ప్ర‌వాహం.. నదీజలాల మీదుగా తేలివచ్చే చల్లని పిల్లగాలులు. నిశ్శబ్ద ప్రకృతిలో నాగార్జునసాగర్‌ - శ్రీశైలం ప్ర‌యాణంలో ఎన్నో మధురానుభూతుల సమ్మేళనం. చుట్టూ దట్టమైన నల్లమల అడవులు. పక్షుల కిలకిలరావాలు. నిశ్శబ్ద ప్రకృతిలో ఆకాశాన్ని అందుకోవాలనుకునే ఎత్తైన పచ్చని కొండల్నీ, నీలి జలాల్లో తన అందాన్ని చూసుకునే నీలాకాశాన్ని, ఆ పచ్చని కొండల్ని తెల్లని మేఘాలని ప్రతిబింబిస్తూ నిశ్చలంగా కదులుతున్న కృష్ణమ్మ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ప్రయాణం చేయవచ్చు. మధ్యలో పచ్చని ద్వీపాలు కనువిందు చేస్తాయి. ఆయా ప్రాంతాల్లో వర్షాలు పుష్కలంగా కురవడం వల్ల ఆల్మటి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని ప్రాజెక్టులూ నిండకుండల్లా మారాయి.

నాగార్జునసాగర్‌లో 590 అడుగుల నీటిమట్టం..

అలల పై నుంచి నల్లమల అందాలను తిలకిస్తూ యాత్ర పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నీటి మట్టం 590 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం ( Launch trip ) కొనసాగించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. నవంబర్‌ 2న హిల్‌కాలనీ లాంచీ స్టేషన్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణాలు ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండ్రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో జలపాతాల అందాలు, జింకలు, దుప్పుల పరుగులు, నదికి ఇరువైపులా నల్లమల అందాల నడుమ అలలపై లాంచీ ప్రయాణం పర్యాటకులకు మధురానుభూతులు పంచనుంది. ప్రతి వారంతపు శనివారం ఉదయం ప్రారంభమయ్యే ఈ లాంచీ ప్రయాణం తిరిగి నాగార్జునసాగర్‌కు చేరుకుంటుంది. ఈ రెండ్రోజుల ప్రయాణంలో పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టూరిజం శాఖ లైఫ్ జాకెట్లు, మంచినీటి వసతి, ఆహార ఏర్పాట్లతో పాటు అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటుంది. అదేవిధంగా పర్యాటకులకు మల్లన్న దర్శనాన్ని, బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది.

నందికొండ నుంచి శ్రీశైలంకు కొనసాగే ఈ రెండు రోజుల ప్రయాణం తీరం వెంబడి వున్న అమ్రాబాద్ నల్లమల్ల అడువుల ప్రకృతి సహజ అందాలు పర్యాటకుల మనస్సులను ఇట్టే కట్టి పడేస్తాయి. కృష్ణమ్మ సవ్వడుల మధ్య సాగే ఈ ప్రయాణంలో చాకలిగట్టు నాగార్జునకొండ సమీపించగానే జింకలు, దుప్పులు కనువిందు చేస్తాయి. గౌతమ బుద్దుడి చారిత్రాత్మక విశేషాలను, జీవిత గాథలను తెలిపే నాగార్జునకొండ ( Nagarjunakonda ) సమీపంగా సాగుతూ కొద్ది ప్రయాణంలోనే పురాతన ఏలేశ్వర గట్టు దర్శనమిస్తుంది. ఈ ప్రయాణంలో చారిత్రక కోటలు, కొండలు, జలపాతాలు, మొసళ్లు, అందమైన పర్వతాలు ముందుకు వెళ్లే కొద్దీ చూడ ముచ్చటైన అందాలు కనివిందు చేస్తూనే ఉంటాయి. సాయంత్రానికి లింగాల గట్టు చేరుకుంటుంది. ఆ తర్వాత పర్యాటకులు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని రెండవ రోజు సాయంత్రానికి లాంచీలో నందికొండ చేరుకుంటారు. నది కొండల మధ్య బోటులో ప్రయాణం అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పర్యాటక ప్రాంతం నాగార్జునసాగర్ అయితే ఇప్పుడు శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు బోటు ప్రయాణం చేయొచ్చు. ఈ ప్రయాణం తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో అంతులేని ఆనందాన్ని అందిస్తోంది. ఆహ్లాదకరమైన నల్లమల అడవి దృశ్యాలతో పాటు ఆధ్యాత్మికమైన వాతావరణం మధ్య ప్రయాణం హాయిగా సాగిపోతుంది. ఈ ప్రయాణం మరవలేని స్మృతులను మిగులుస్తుందంటున్నారు పర్యాటకులు. నాగార్జునసాగర్ నుండి దాదాపు ఏడు గంటల పాటు ప్రయాణం(జర్నీ) మొదలౌతుంది. ఏడు గంటల పాటు సాగే ఈ జర్నీలో పక్షుల కిలకిలారావాలతో నీటి సవ్వడుల మధ్య ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ పచ్చటి కొండల చుట్టూ తిరుగుతు ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. ఇక్కడ మరో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే.. ఈ ప్రయాణం పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మపై పకృతిని ఆస్వాదిస్తూ సాగే ప్రయాణం ఎంతో బాగుంటుంది. సాగర్ నుండి మొదలై శ్రీశైలం వరకు సాగే ఈ ప్రయాణంలో మనకు తెలియని ఎన్నో కొత్త, వింతైన విషయాలను తెలిపేందుకు ఇక్కడ ఓ గైడ్ కూడా ఉంటాడు. అతను ప్రతీ ప్రదేశం ప్రత్యేకతను పర్యాటకులకు వివరిస్తుంటాడు. ఇక కృష్ణానదిలో బోటు ప్రయాణం చేసినంత సేపు మనకు ఇంకేం గుర్తుండదు. ఏ టెన్షన్ కూడా మన దరిచేరవు. అలా ఉంటుంది వాతావరణం. ఆ మనోహరమైన, ఆహ్లాదకరమైన వాతావరణానికి మనసు ఆనందతాండవం చేస్తుంది.

కృష్ణా నదిలో దాదాపు 110 కిలోమీటర్ల దూరం ప్రయాణం తర్వాత శ్రీశైలానికి బోటు చేరుకుంటుంది. సాగర్ జలాశయం నుంచి నవంబర్ 2 న ఉదయం 9.30 గంటలకు సాగర్‌ హిల్‌ కాలనీ నుంచి ప్రయాణం సాయంత్రం 5 గంటలకు శ్రీశైలం మల్లికార్జున స్వామిని చేరుకుంటుంది. అక్క‌డి ప్ర‌శాంత వాతావ‌ర‌ణం సంద‌ర్శ‌కుల‌ను చారిత్ర‌క ప్ర‌పంచంలోకి తీసుకువెళ్లే అనుభూతిని అందిస్తుంది. నాగార్జున కొండ ఎడమవైపున కొంత దూరంలో ఏలేశ్వరం గుట్ట ఉంటుంది. నల్లగొండ, నాగర్‌కర్నూల్‌, కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని ఆదివాసీలు, చెంచులు, గిరిజనులు గుట్టపైనున్న శివుడిని ఆరాధిస్తారు. కుడివైపు, ఆంధ్ర, ఎడమవైపు తెలంగాణ ప్రాంతంలోని నల్లమల కొండలు.. వాటి మధ్యలో కృష్ణ‌మ్మ ఒడిలో ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో కృష్ణా నది మీదుగా మెల్లగా కిందకి దిగుతున్న సూర్యబింబాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవ్ఞ. రెండు గుట్టల మధ్య పాతాళగంగ వద్ద కట్టిన వారధి కింది నుంచి శ్రీశైలం డ్యామ్‌ ఎదురుగా ఎడమవైపున ఉన్న లింగాల గుట్ట శ్రీశైల మల్లన్న, భ్రమరాంబికా దేవిని దర్శించుకుని శ్రీశైలం ప్రాజెక్టు చూసి తిరుగుప్రయాణంలో నల్లమల అందాలే గాక దుందుబీ నది సంగమం కనువిందు చేస్తాయి. మరిచిపోలేని అనుభూతులు మిగులుతాయి

లాంచీ ప్రయాణ రేట్లు.పర్యాటక అభివృద్ధి సంస్థ, వాటర్‌ ఫీడ్‌ జీఎం ఇబ్రహీం..

నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని నవంబర్‌ 2 నుం చి ప్రారంభిస్తున్నట్టు పర్యాటక అభివృద్ధి సంస్థ, వాటర్‌ ఫీడ్‌ జీఎం ఇబ్రహీం ప్రకటనలో తెలిపారు. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ చేరుకొని హిల్ కాలనీ లాంచ్ స్టేషన్ నుండి శ్రీశైలానికి లాంచీ ప్రయాణానికి వన్‌వేకు పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600, రానుపోను పెద్దలకు రూ.3వేలు, పిల్లలకు రూ.2,400 చొప్పున చార్జీ వసూలు చేస్తున్నట్లు తెలిపారు. వివరాలకు 984854037 1, 98481258720, 7997951023 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Tags:    

Similar News