శ్రమ దోపిడికి వ్యతిరేకంగా ఉద్యమించాలి

శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలను ఉదృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని..కార్మిక వ్యతిరేక కోడ్ లను ప్రభుత్వం రద్దు చేసే వరకు పోరాటం ఆపేది లేదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యూసుఫ్ అన్నారు.

Update: 2024-11-12 12:35 GMT

దిశ, చౌటుప్పల్ టౌన్: శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలను ఉదృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని..కార్మిక వ్యతిరేక కోడ్ లను ప్రభుత్వం రద్దు చేసే వరకు పోరాటం ఆపేది లేదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యూసుఫ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని జయశ్రీ గార్డెన్ లో మంగళవారం ప్రారంభమైన జిల్లా స్థాయి ట్రేడ్ యూనియన్ల శిక్షణ తరగతుల కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.  పాలక వర్గాలు కార్పోరేట్ శక్తుల తొత్తులుగా మారాయని..అనేక దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న హక్కులు కనుమరుగై మోడీ సర్కారు కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయని ఆరోపించారు. 1920 లో ఆవిర్భవించిన ఈ కార్మిక సంఘం స్వాతంత్య్ర పోరాటంలో అలుపెరుగని పాత్ర పోషించిందని తెలిపారు. కార్మిక చట్టాల సవరణ పేరుతో యాజమాన్యాల కింద కార్మికులు బానిసలుగా పనిచేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. మోడీకి కార్మిక సంక్షేమం తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచీకరణ, మతోన్మాదం, కార్మిక చట్టాల సవరణను ప్రతిఘటించేందుకు సమరశీల పోరాటాలకు కార్మిక లోకం సిద్ధం కావాలన్నారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు మాట్లాడుతూ.. పాలకులు ఆవలంభిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతకు ముందు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోరేటి రాములు, ప్రధాన కార్యదర్శి ఎండీ. ఇమ్రాన్ లు అధ్యక్ష వర్గంగా వ్యవహరించగా..రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ జెండాను ఆవిష్కరించారు. ఈ శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ, సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీ రాములు, సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పానుగంటి పర్వతాలు, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కురిమిద్ద శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బచ్చనగొని గాలయ్య, చెక్క వెంకటేష్, వివిధ మండలాల సీపీఐ కార్యదర్శులు పల్లె శేఖర్ రెడ్డి, దుబ్బాక భాస్కర్, పోలేపాక యాదయ్య, అన్నమోని వెంకటేష్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శంకర్, గొరిగే నరసింహ, సహాయ కార్యదర్శులు గనబోయిన వెంకటేష్, కోరేళ్ళ మచ్చగిరి, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు టంగుటూరి రాములు, సీపీఐ పట్టణ కార్యదర్శి పగిళ్ల మోహన్, రెడ్డి, పాపగళ్ల శంకరయ్య నాయకులు చిలివేర్ అంజయ్య, రామలింగయ్య, రెహమాన్, కొండూరు వెంకటేష్, బద్దుల సుధాకర్, ఆరుట్ల నరేష్, సైదులు, భాస్కర్, బిక్షపతి, అంజయ్య, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


Similar News