ఎమ్మెల్యే బత్తుల ఆదేశాలు బేఖాతరు..

ధాన్యం కొనుగోలులో అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. మద్దతు ధర దేవుడేరుగు కానీ కనీసం కొనుగోలు చేయలేమని మిల్లర్లు చేతులేత్తెస్తున్నారు.

Update: 2024-11-10 06:21 GMT

దిశ, మిర్యాలగూడ టౌన్ : ధాన్యం కొనుగోలులో అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. మద్దతు ధర దేవుడేరుగు కానీ కనీసం కొనుగోలు చేయలేమని మిల్లర్లు చేతులేత్తెస్తున్నారు. దీంతో రైస్ మిల్లుల వద్ద ధాన్యం ట్రాక్టర్లు బారులు తీరి ఉన్నాయి. నల్గొండ జిల్లాలోనే మిర్యాలగూడ నియోజకవర్గంలో అత్యధికంగా రైస్ మిల్లులు ఉన్న ప్రాంతంగా గుర్తింపు ఉండటం వలన ధాన్యం కొనుగోలు ఎక్కవగా జరుగుతున్నాయి. దీని వలన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధాన్యం వస్తది. ఆదివారం మిర్యాలగూడ మండల యాద్గార్ పల్లి, వేములపల్లి మండలం శెట్టి పాలెం వద్ద ప్రధాన రహదారి పై ధాన్యం ట్రాక్టర్లు నిలిచిపోయాయి. ప్రతి మిల్లు వద్ద సుమారు 20 నుంచి 30 ట్రాక్టర్లు నిలిచి ఉన్నాయి. సన్న రకం ధాన్యానికి కనీసం ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కూడా అందివ్వడం లేదు. క్వింటాళ్లకు రూ. 2200 నుంచి 2300 వరకు మిల్లర్లు ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.

మిల్లులను సందర్శించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..

కొనుగోలు నిలిపివేయడంతో యాద్గార్ పల్లి , వేములపల్లి మండలాల్లోని రైస్ మిల్లులను సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కొనుగోలు నిలిపివేత పై మిల్లర్ల యాజమానులతో మాట్లాడారు. మద్దతు ధరకు కొనుగొలు చేయాలని మిల్లర్లను కోరారు. లేని పక్షంలో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న మిల్లుల పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే పూజ ధాన్యంకు రూ. 2320, చింట్లు ధాన్యంకు రూ. 2400 ధరతో కొనుగోలు చేయాలని అన్నారు. అయినప్పటికి మిల్లర్లు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు.

ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతరు..

ధాన్యం కొనుగోలులో మిల్లర్లు మద్దతు ధరకే కొనుగోలు చేయాలని శనివారం జాయింట్ కలెక్టర్, మిల్లర్లతో జరిగిన సమావేశంలో ఆదేశించారు. అధికారులు, ఎమ్మెల్యేలు చెప్పిన మిల్లర్లు పెడచెవిన పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఒక్కసారిగా మిల్లర్లందరూ కొనుగోలు నిలిపివేయడం పై రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


Similar News