బీఎల్ఆర్ జోడో యాత్రకి కళ్లెం.. సీనియర్ హుకుంతో ఆపిన రెండో విడుత పాదయాత్ర..
కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మా రెడ్డి చేపట్టిన రెండో విడుత జోడో యాత్రకు కళ్లెం పడింది.
దిశ, మిర్యాలగూడ : కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మా రెడ్డి చేపట్టిన రెండో విడుత జోడో యాత్రకు కళ్లెం పడింది. మిర్యాలగూడ మండలం తడకమల్ల గ్రామం నుంచి ఆదివారం యాత్ర చేపట్టెందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న బీఎల్ఆర్ ని, కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఒకరు యాత్ర ఆపాలని గట్టిగా ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పట్ల నియోజకవర్గ ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నప్పటికీ గ్రూపు తగాదాలతో పార్టీ పట్ల చిన్నచూపు ఏర్పడుతుంది.
అధిష్టానం ఆదేశాల మేరకు పదిరోజుల క్రితం బీఎల్ఆర్ నియోజకవర్గంలోని వేములపల్లి మండల వ్యాప్తంగా 154 కిలోమీటర్లు జోడో పాదయాత్ర చేసి అన్ని గ్రామాల ప్రజలను కలిసి సమస్యలు గుర్తించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ద్వారానే సమస్యలు పరిష్కారం చేయబడుతాయని ప్రజలకు హామీ ఇచ్చారు. అదే ఊపుతో ఆదివారం నుంచి మండల వ్యాప్తంగా రెండో విడుత జోడో యాత్రకు బీఎల్ఆర్ సిద్దపడ్డారు. ప్రజాదరణ తట్టుకోలేని కొందరి ఫిర్యాదు మేరకు సీనియర్ నేత కల్పించుకొని పాదయాత్ర ఆపాలంటూ గట్టిగా ఆదేశించినట్లు గుసగుస లు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్ ఉపందుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పెద్దల నిరసన వైఖరిని నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా విమర్శిస్తున్నారు.