ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైన్స్ నిర్వాహకులు..బీర్‌లో నాచు
యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల
దిశ,సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని వైన్స్ లో శనివారం ఉదయం ఓ ఆరు బీర్లు కొనుగోలు చేశాడు. వాటిని ఇంటికి వెళ్లి తాగేందుకు సిద్ధం కాగా ఒక బీరులో పూర్తిగా నాచు తో నిండి ఉంది. దీంతో కంగుతిన్న కొనుగోలుదారులు మరో వ్యక్తితో బీరులో నాచు వచ్చిందని చెప్పి వైన్స్ వద్దకు తీసుకుని వెళ్లగా ఈ బీరు తమ వద్ద తీసుకున్నట్లు ఎలా గుర్తించాలని తిరిగి వైన్స్ యజమానులే ప్రశ్నించడంతో కస్టమర్ అవాక్కుతినేలా చేసింది. మీ వైన్స్ లో కొనుగోలు చేసిన బీరుని మీరే నిర్ధారించకపోతే ఎలా అని కస్టమర్ నిలదీయగా మాకు గుర్తించడానికి ఎలాంటి ఆనవాళ్లు ఉండవని వైన్ యజమానులు చెప్పడం విడ్డూరంగా ఉంది. అంతేకాకుండా దీనిపై ఎక్సైజ్ అధికారులను వివరణ అడుగగా వారు కూడా ఇదే తరహా సమాధానం ఇవ్వడంతో కస్టమర్లు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి నెలకొంది.
డిస్టిబ్యూటర్ నుండి మాకు ఇలాంటి బీర్లు సరఫరా అవుతున్నాయని వైన్స్ యజమానులు సమాధానం ఇచ్చారు. ఎక్సైజ్ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం కారణంతోనే పదేపదే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఎన్ని సంఘటనలు జరిగిన వైన్స్ నిర్వాహకుల మీద ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణం. పరోక్షంగా వైన్స్ యజమానులకు ఎక్సైజ్ అధికారులు మామూలు మత్తుకు అలవాటు పడి ఇలా సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్థానిక ఎక్సైజ్ అధికారులపై పర్యవేక్షణ ఉంచి వైన్స్ యజమానులపై కూడా చర్యలు తీసుకునేలా పనిచేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.