అకాల వర్షం..రైతులకు నష్టం

మండల పరిధిలోని వర్ధమానుకోట గ్రామంలో ఐకేపీ

Update: 2024-11-02 08:50 GMT

దిశ, నాగారం: మండల పరిధిలోని వర్ధమానుకోట గ్రామంలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రంలో అకాల వర్షంతో వరి ధాన్యం తడిసి ముద్దయింది. వరి ధాన్యం కుప్పలు, ఆరబోసిన వడ్ల పక్కన వర్షపు నీరు నిలిచింది. నర్సింగ నర్సయ్య అనే రైతుకు చెందిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. కడియం రమేష్ అనే రైతుకు చెందిన పన్నెండు పుట్ల(96 బస్తాలు) వడ్లు అకాల వర్షానికి తడిసి ముద్ద అయి మొలకలు వచ్చే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షంలో తడవడం తో పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రానటువంటి దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.

వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రం అట్టహాసంగా ప్రారంభించి రెండు మూడు వారాలు అయిన ఇంకా తూకాలు మొదలవ్వలేదు.అకాల వర్షాలు అన్నదాతలను కలవర పెడుతున్నాయి.తమ కండ్ల ముందే ధాన్యం కొట్టుకుపోతున్నా రైతులు ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో కాంటా తూకాలు వెంటనే ప్రారంభించాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.


Similar News