ధర్నా చౌక్ ఎత్తివేత.. మండిపడుతున్న ప్రజాసంఘాలు..

కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నేడు ధర్నాలు, నిరసనలకు తావు లేకుండా పోతుంది. ప్రశ్నించే గొంతులను నొక్కుతూ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి నెలకొంది.

Update: 2023-06-18 07:49 GMT

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నేడు ధర్నాలు, నిరసనలకు తావు లేకుండా పోతుంది. ప్రశ్నించే గొంతులను నొక్కుతూ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన రైతుల పై నాన్ బెయిలబుల్  కేసులు పెట్టి జైలు పాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మరువక ముందే కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ ను ఎత్తివేసి హరితహారం మొక్కలు నాటుతున్నారు. నిరసన తెలుపుతున్న వ్యక్తుల పై కేసులు పెడుతూ నేడు ధర్నాచౌక్ ను ఎత్తివేయడం పై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో ఉన్న ధర్నాచౌక్ ను ఎత్తివేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ జిల్లాలో నిరసన తెలుపుకోవడానికి అవకాశం లేకుండా జిల్లా కలెక్టరేట్ యంత్రాంగం చేస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హరితహారం మొక్కలు సిద్ధం...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అవతరణ ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరిత దినోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వద్ద మొక్కలు నాటేందుకు ఆదివారం గుంతలు తీశారు. గతంలో నిరసనలు, ధర్నాలు తెలుపుకొని అవకాశం కల్పిస్తూ కలెక్టరేట్ ముందు భాగంలో ధర్నా చౌక్ బోర్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ బోర్డును తొలగించి హరితహారం మొక్కలు నాటేందుకు గుంతలు తీసి మొక్కలను తెచ్చి సిద్ధంగా ఉంచారు. ధర్నా చౌక్ స్థలంలో మొక్కలు నాటితే ధర్నా చేసుకునే అవకాశం ఇకనుండి ఉండదు. కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించుకుని తమ బాధను చెప్పుకునేందుకు అవకాశం లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News