నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన ధ్యేయం...
నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.
దిశ ,నకిరేకల్ :నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. కేతపల్లి మండలంలోని 45 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం అందజేసి మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోని నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించి తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకుంటానన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సంక్రాంతి లోపు రైతు భరోసాను అందిస్తామని మరోసారి గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో..అమలు చేస్తున్నామన్నారు. గత పాలకులు నియోజకవర్గంలో విధ్వంశాలు సృష్టించారు..తప్ప అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రగామిలో నిలుపుతానని హామీలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకటరెడ్డి, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.