మునుగోడుకు కేసీఆర్ వరాల జల్లు కురిపించేనా?
దిశ, ప్రతినిధి, నల్లగొండ : మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ క్షేత్రస్థాయిలో కార్యరంగంలోకి దిగాయి. ఓవైపు కాంగ్రెస్ పార్టీ మండలాల వారీగా సమావేశాలు
దిశ, ప్రతినిధి, నల్లగొండ : మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ క్షేత్రస్థాయిలో కార్యరంగంలోకి దిగాయి. ఓవైపు కాంగ్రెస్ పార్టీ మండలాల వారీగా సమావేశాలు, పాదయాత్రలు చేస్తుంది. టీఆర్ఎస్ అధిష్టానం నేడు ప్రజాదీవెన పేరుతో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. కాగా, మునుగోడు ఉపఎన్నిక ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ మునుగోడును చేజిక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీంతో ప్రజల్లోకి బలంగా వెళ్లడంతోపాటు మునుగోడులో టీఆర్ఎస్‌ను ఎందుకు గెలిపించాలనే విషయమై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ ప్రజాదీవెన బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ప్లాన్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించింది. బహిరంగ సభకు సైతం భారీగా జనసమీకరణ చేసేందుకు పక్కా ప్లాన్ చేశారు.
ఈ సభలో మునుగోడుపై సీఎం కేసీఆర్ వరాలు జల్లు కురిపిస్తాడా..? లేదా..? అనే విషయంపై ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఆ పార్టీ అభ్యర్థిని కూడా కరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కూసుకుంట్ల పేరు ప్రధానంగా వినిపిస్తుండగా.. బీసీవర్గానికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఈ క్రమంలో కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడనేదానిపై ఆ నేతల్లో ఆసక్తి నెలకొన్నది.
వరాల జల్లు కురిసేనా..?
గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని టీఆర్ఎస్ దక్కించుకుంది. అయితే తిరిగి 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆ స్థానం కోల్పోయింది. కానీ అనుహ్యాంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉపఎన్నిక రావడం.. టీఆర్ఎస్‌కు మంచి అవకాశం దొరికినట్టయ్యింది. ఏలాగైనా ఈ ఉపఎన్నికలో గెలిచి.. మునుగోడుపై గులాబీ జెండా రెపరెపలాడించాలని చూస్తోంది. అందుకోసం ప్రతి మండలానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించింది. బహిరంగ సభకు సైతం భారీగా జనసమీకరణ చేసేందుకు పక్కా ప్లాన్ చేశారు. లక్షమందికి పైగా జన సమీకరణ చేసే యోచనలో టీఆర్ఎస్ ఉంది. ఈ క్రమంలోనే బహిరంగ సభా వేదికగా సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మునుగోడు గోస తీరేనా..?
ఉమ్మడి పాలనా కాలం నాటి నుంచే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం వెనుకబడిపోయింది. ఓవైపు కరువు రక్కసి.. మరోవైపు ఫ్లోరైడ్ మహమ్మారి కారణంగా మునుగోడు అసెంబ్లీ ప్రజానీకం ఉక్కిరిబిక్కిరయ్యింది. దీనికితోడు సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడం.. నిరుద్యోగ సమస్య.. వలసల బతుకులే ఇక్కడి ప్రజానీకానికి దిక్కయ్యింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాస్తంత అటువంటి పరిస్థితుల నుంచి బయటపడేలా కన్పించినా.. రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం కారణంగా అదీ సాధ్యపడలేదు. అయితే ప్రస్తుతం ఉపఎన్నికలు వచ్చిన ప్రతీ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందనే వాదన ఉంది. దీంతో మునుగోడు ఉపఎన్నికతో ఈ అసెంబ్లీ రూపురేఖలు మారతాయా..? లేదా..? షరామాములుగానే ఉంటుందా..? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
అభ్యర్థిని ప్రకటించే అవకాశం..
మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి ఎవరికి అవకాశం దక్కనుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా రేసులోకి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. కానీ ఇదే సమయంలో బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ లేకపోలేదు. ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం విషయంలో సొంత పార్టీకి చెందిన టీఆర్ఎస్ నేతలే.. తీవ్రంగా వ్యతిరేకించారు. ఏకంగా 300మంది రహస్యంగా భేటీ అయ్యారు. ఒకానొకదశలో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కొంతమంది నేతలు ఇప్పటికే పార్టీ మారారు. ఇటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ అధిష్టానం ప్రజాదీవెన బహిరంగ సభలో టీఆర్ఎస్ మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిని ప్రకటిస్తారా..? లేదా..? అన్న ఉత్కంఠ నెలకొన్నది. ఒకవేళ ఇప్పుడే సీఎం కేసీఆర్ అభ్యర్థి పేరు ఖరారు చేస్తే.. మిగిలిన అసంతృప్తి నేతలు పార్టీకి సహకరిస్తారా..? హ్యాండిస్తారా..? అన్నది వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి :