కారులో పెట్రోల్ పోసుకుని లవర్స్ సజీవ దహనం
ఓ ఆగంతకుడి బ్లాక్ మెయిల్ కు భయపడి కారులో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని నిండు ప్రాణాలను పోగొట్టుకున్నారు.
దిశ,భూదాన్ పోచంపల్లి: ఓ ఆగంతకుడి బ్లాక్ మెయిల్ కు భయపడి కారులో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని నిండు ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ ఘటన ఘట్కేసర్ మండలంలోని ఘనపూర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది . విరాల్లోకి వెళితే..యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పిల్లాయిపల్లి గ్రామానికి చెందిన పర్వతం శ్రీరామ్ (25) పది సంవత్సరాల క్రితం జమీలపేట్ లో నివాసం ఉంటున్నాడు. అయితే ఐదు సంవత్సరాల నుండి పోచారం మున్సిపాలిటీ నారపల్లి సమీపంలో సైకిల్ రిపేర్ షాప్ పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే అక్కడే ఉంటున్న ఓ మైనర్ బాలికతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం బాలిక బంధువైన చింటూకు తెలిసింది. అతను ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతానని బెదిరిస్తూ ఇప్పటివరకు 1.35 లక్షల రూపాయలు వసూలు చేశాడు. మరిన్ని డబ్బులు కావాలని చింటూ వేధించడంతో.. చేసేదేమీ లేక ప్రేమ జంట ఇద్దరూ కారులో నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం స్వగ్రామమైన పిల్లాయిపల్లిలో శ్రీరామ్ అంతక్రియలను నిర్వహించారు. పర్వతం అంజయ్య-యాదమ్మ దంపతుల చిన్న కుమారుడైన పర్వతం శ్రీరామ్ చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.