పెరుగుతున్న ధాన్యం.. తగ్గుతున్న ధర..
రబీ సీజన్ వరి కోతలు ప్రారంభం కావడంతో మిల్లుల

దిశ, మిర్యాలగూడ : రబీ సీజన్ వరి కోతలు ప్రారంభం కావడంతో మిల్లుల వద్దకు ధాన్యం విక్రయించేందుకు రైతులు వస్తున్నారు. కోతలు ముమ్మరంగా చేపట్టడంతో రోజురోజుకు ధాన్యం ట్రాక్టర్లు పెరుగుతున్నాయి. దీంతో అదునుగా భావించిన మిల్లర్లు సిండికేట్ గా మారి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం పెరిగే కొద్దీ రేటును తగ్గిస్తూ రైతులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాగా అన్ని మిల్లుల లో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వలన రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతోపాటు వాతావరణంలో మార్పులు వస్తే సన్నరకం ధాన్యం అడ్డం అడ్డం పడి పెద్ద ఎత్తున ధాన్యాన్ని నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు భయాందోళనకు గురవుతున్నారు.
గత సీజన్లో మద్దతు ధర తగ్గించకుండా అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మిల్లర్ల తో సమావేశం ఏర్పాటు చేసి ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొంతమేర ఇబ్బంది లేక పోయినప్పటికీ కొన్ని మిల్లుల లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి రైతులకు తీవ్ర అన్యాయం చేశారు. దీంతో పలుమార్లు రైతులు రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సాగర్ ఎడమ కాల్వ పరిధిలో, మూసి ప్రాజెక్టు పరిధిలో వరి సాగు గణనీయంగా ఉండడం వలన భారీ మొత్తంలో ధాన్యం చేతికి వచ్చే అవకాశాలున్నాయి. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు మిల్లర్లను సమన్వయం చేసి రైతులకు ఇబ్బంది కలక్కుండా ముందస్తుగానే చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
కొనుగోలు ప్రారంభించని మిల్లర్లు..
మిర్యాలగూడ పట్టణ, పరిసర ప్రాంతాలలో సుమారు 120కి పైగా రైస్ మిల్లులు ఉన్నాయి. వరి కోతలు ప్రారంభమైనప్పటికీ అన్ని మిల్లుల లో ధాన్యం కొనుగోలు చేయకుండా ఉండడం వలన రైతులు తక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ప్రస్తుతం పది నుంచి 15 మిల్లుల లో మాత్రమే ధాన్యం కొనుగోలు చేపడుతున్నారు. అది కూడా క్వింటా కు రూ.2200 నుంచి రూ.2350 వరకు మాత్రమే ధర చెల్లిస్తున్నారు. ధాన్యం అధిక మొత్తంలో వచ్చినప్పుడు తక్కువ రేటుకు కొనుగోలు చేయాలని ఆశతో అన్ని మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొనుగోలు చేస్తున్న మిల్లులలో కూడా తక్కువ రేటుకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. గత సీజన్లో జిల్లా స్థాయి అధికారులు ప్రతి మిల్లు పై సివిల్ సప్లై అధికారుల పర్యవేక్షణ ఉండాలని సూచించినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వలన రైతులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. సీజన్ ప్రారంభం అవుతుండడం వలన అధికారులు ముందస్తుగానే చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
సిండికేట్ గా మారుతున్న మిల్లర్లు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యధిక రైస్ మిల్లు కలిగిన ప్రాంతం కావడంతో పాటు ఎక్కువగా ధాన్యం పండించడం వలన మిల్లర్లంతా సిండికేట్ గా మారి ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ధాన్యం అవసరం ఉన్నప్పటి కూడా తమకు అవసరం లేదని, ధాన్యం నాణ్యత సరిగా లేదని కొర్రి పెడుతూ తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇదంతా మిల్లర్స్ అసోసియేషన్ కను సైగల్లోనే జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా అధికారులు మాత్రం నెలవారి మామూలు కు అలవాటు పడి మిల్లర్ల పై ఎలాంటి చర్యలకు పాల్పడడం లేదని రైతుల పేర్కొంటున్నారు. గత సీజన్లో పలు రైస్ మిల్లుల యాజమాన్యం ధాన్యం కొనుగోళ్లు నిర్లక్ష్యం వహించిన అప్పటికి మిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మిల్లర్లకు అలవాటుగా మారింది. దీంతో కష్టపడి పంట పండించిన రైతులు అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరో వారం రోజుల్లో ధాన్యం ఎక్కువ మొత్తంలో విక్రయానికి వస్తుండడం వలన అధికారులు గత సీజన్లో జరిగిన పొరపాట్లు జరగకుండా, రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.