నిద్ర పోతున్న నిఘా వ్యవస్థ.. పల్లెల్లో కూడా పేకాట, క్రికెట్ బెట్టింగ్!
పట్టణాలకు పరిమితమైన ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, పేకాట రోజురోజుకు గ్రామీణ ప్రాంతాల్లో చాప కింద నీరులా విస్తరిస్తోంది.
దిశ ,మర్రిగూడ: పట్టణాలకు పరిమితమైన ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, పేకాట రోజురోజుకు గ్రామీణ ప్రాంతాల్లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. బెట్టింగ్ లో 25 ఏళ్ల లోపు వారే పాల్గొని లక్షలాది రూపాయలు పోగొట్టుకోవడంతో తల్లిదండ్రులు భూములను తెగ నమ్మి బాకీలు కట్టడం,కొడుకులను ఆత్మహత్యల బారి నుండి కాపాడుకోవడం కోసం భూములను రిజిస్ట్రేషన్ చేయడం షరా మామూలుగా జరుగుతుంది. హైదరాబాదుకు మర్రిగూడ కూతవేటు దూరంలో ఉండడంతో ఇక్కడ అన్ని అసాంఘిక కార్యక్రమాల కు అడ్డాగా మారింది. మండల కేంద్రానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో యువత ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ కడుతూ లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నట్టు తెలుస్తుంది. ఓ గ్రామ పంచాయతీకి చెందిన సుమారు 25 మంది యువకులు కోట్లాది రూపాయలు బెట్టింగ్ కట్టి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోపోతే వారి తల్లిదండ్రులు భూములను రిజిస్ట్రేషన్ చేసి పిల్లలను ఆత్మహత్య నుంచి కాపాడుకున్నట్లు మండల వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం సాగుతుంది.
ఓ వడ్రంగి సైతం ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి సుమారు పది లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు ప్రచారం సాగుతుంది. వ్యవసాయ భూములలో పేకాట రాయుళ్లు యథేచ్ఛగా పేకాట ఆడుతున్నారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టి , పేకాట సైతం జోరుగా సాగుతుండడంతో యువత తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అసాంఘిక కార్యక్రమాలు సాగుతున్న నిఘా వ్యవస్థ నిద్దుర పోవడం ఆందోళన కలిగిస్తుంది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ లో 20 లక్షలు ఒకరు 48 లక్షలు ఒకరు పోగొట్టుకోవడంతో వారి తల్లిదండ్రులు కుమారులను కాపాడుకోవడం కోసం భూమిని అప్పు కింద రిజిస్టర్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది.
ఎందరో యువకులు పేకాట జూదంలో డబ్బులు పోగొట్టుకుని రోడ్డున పడ్డారు. గ్రామాల్లోకి రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఖరీదైన కార్లలో జూదరులు వచ్చి ఆన్లైన్ బెట్టింగ్ పేకాట నిర్వహిస్తున్నారని తెలిసింది.ఇప్పటికైనా నిఘా వ్యవస్థ ప్రకడ్బందీగా నిఘా వేసి ఆన్లైన్ బెట్టింగ్ స్థావరాలపై పేకాట స్థావరాలపై దాడులు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.
అప్పు కింద భూముల రిజిస్ట్రేషన్
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ లో లక్షల రూపాయలు పెట్టి ఎందరో యువత అప్పుల పాలయ్యారు. అప్పులు ఇచ్చినవారు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేయడంతో ఎటు పాలు పోక ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడ్డారు. తల్లిదండ్రులకు విషయం తెలిసి కుమారులను దక్కించుకోవడానికి అప్పు కింద వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసినట్టు మండలంలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది.
పేకాటకు వ్యవసాయ భూములు అడ్డా
హైదరాబాదుకు మర్రిగూడ మండలం కూతవేటు దూరంలో ఉండటంతో పేకాట రాయుళ్లకు అడ్డాగా మారింది. వ్యవసాయ భూముల్లో పేకాట ఆడుతూ లక్షలకు లక్షలు జూదం ఆడుతున్నారు. హైదరాబాదు నుంచి ఖరీదైన కార్లలో వచ్చి పేకాట ఆడుతూ విందు వినోదాలు చేస్తున్నారు. జూదరులంతా రియల్ ఎస్టేట్ ముసుగులో వచ్చి అసాంఘిక కార్యక్రమాలకు తెగబడుతున్నారని సర్వత్ర ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ఒక జూదరి అందరికీ మామూలు ముడుతున్నాయి.. ఇక మమ్ములను ఆపేది ఎవరని బహిరంగంగా అనడంతో ఒక ఉన్నతాధికారి ఆ జూదరిని పిలిచి మందలించినట్లు తెలిసింది. అసాంఘిక కార్యక్రమాలకు మర్రిగూడ మండలం అడ్డాగా మారడంతో ఇక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.