Zero Current Bill: అర్హులకు అందని గృహజ్యోతి పథకం..!

Update: 2024-08-09 02:54 GMT

దిశ, మిర్యాలగూడ: ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలలో గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాలు పేద ప్రజలకు అందడం లేదు. నల్గొండ జిల్లా నుంచి 6,11,853 సూర్యాపేట జిల్లానుంచి 3,62,203, యాదాద్రి భువనగిరి నుంచి 2,17,862 మంది దరఖాస్తు చేసుకున్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే మహాలక్ష్మి పథకం తో పాటు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు వర్తించే గృహజ్యోతి పథకాలు అర్హులందరికీ అందట్లేదు. ఇందుకు లబ్ధిదారులు దరఖాస్తు చేయడంలో తప్పులు చేయడంతో పాటు డాటా ఎంట్రీ ఆపరేటర్ల నిర్లక్ష్యం కారణంగా కనిపిస్తుంది.

దరఖాస్తు నింపడంలో పొరపాట్లు

సంక్షేమ పథకాలకు దరఖాస్తుదారులు దరఖాస్తు నింపడంలో పొరపాట్లు చేసినట్లు తెలుస్తుంది. దీంతోపాటు డాటా ఆన్లైన్లో అప్లోడ్ చేయడంలో ఆపరేటర్ల నిర్లక్ష్యం ప్రధాన కారణంగా అధికారులు పేర్కొంటున్నారు. ఒకే దరఖాస్తులో ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలను దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. కాగా లబ్ధిదారుడు అవసరమైన పథకానికి ఎదురుగా ఉన్న గడిలో టిక్ చేయాల్సిన ఉన్న కొందరు టిక్ చేయకుండా దరఖాస్తులు అందజేశారు. విద్యుత్తు, గ్యాస్ పథకాలకు దరఖాస్తు చేసేటప్పుడు యూఎస్సీ నెంబర్ కు బదులుగా సర్వీస్ నెంబరు నమోదు చేయడం, ఎల్పిజి యూనిట్ ఐడి లో పొరపాటుగా రాయడం వంటి కారణాలతో లబ్ధిదారులు నష్టపోతున్నారు.

సవరణకు అవకాశం ఇచ్చినా ఫలితం శూన్యం ..

పేదలకు అందించే సంక్షేమ పథకాల దరఖాస్తులలో సవరణకు అవకాశం ఇచ్చిన ఫలితం శూన్యంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన సవరణల ద్వారా కేవలం నాట్ మ్యాచ్డ్ అని ఉంటేనే సవరించడానికి అవకాశం ఉంటుంది. కొందరి దరఖాస్తు ఫారంను ఆన్లైన్లో పరిశీలిస్తే నాట్ అప్లైడ్ అని ఉంటే సవరించడానికి వీలు లేకుండా పోతుంది. దీం తో లబ్ధిదారుల పొరపాటు కొంతమేరకు ఉండగా, ఆన్ లైన్ లో డాటా ను ఎంటర్ చేసిన ఆపరేటర్ల నిర్లక్ష్యం వలన నాట్ అప్లైడ్ అని చూపిస్తోంది.

వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెం గ్రామానికి చెందిన జానపాటి సోమమ్మ గృహ జ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లు దరఖాస్తు ఫారం లో టిక్ చేసినప్పటికీ, ఆన్లైన్లో దరఖాస్తు చేయలేదు అన్నట్టు చూపిస్తుంది. దీంతో ఈమెకు గృహ జ్యోతి పథకం వర్తించడం లేదు. దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వలన అర్హులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు.

Tags:    

Similar News