దరిద్రానికి నేస్తం....హస్తం... : కేటీఆర్

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవకాశం ఇస్తే రాబందుల లెక్క రైతులను పీక్కుతింటారని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

Update: 2023-11-20 11:28 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవకాశం ఇస్తే రాబందుల లెక్క రైతులను పీక్కుతింటారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం యాదగిరిగుట్టలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ సమయంలో రాష్ట్ర ప్రజలు కరెంటు కష్టాలతో ఇబ్బందులు పడేవాళ్లన్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డికి సిగ్గు, శరం లేకుండా కరెంట్ గురించి మాట్లాడుతున్నారని మండి పడ్డారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు ఒక బస్సు ఏర్పాటు చేస్తామని, ఆలేరు నియోజకవర్గంలో ఎక్కడైనా కరెంటు తీగలు పట్టుకోని, అప్పుడు 24 గంటల కరెంటు వస్తుందో లేదో తెలుస్తుందని చెప్పారు.‌ మూడు గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెస్ కావాలా...24 గంటల కరెంటిస్తున్న బీఆర్ఎస్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు.

కాంగ్రెస్ వస్తే కరెంట్ పోతుందన్నారు. కాంగ్రెస్ కావాలో...కరెంటు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చింది ఉచిత కరెంటు కాదని, ఉత్తుత్తి కరెంట్ అని విమర్శించారు. వరిధాన్యం పండించడంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నంబర్ వన్ అన్నారు. 55 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్లు ఏంపీకారని గట్టిగా మండిపడ్డారు. భూమికి రెండు ఫీట్లు లేని రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను తిడుతున్నాడని విమర్శించారు. ఎందుకియ్యాలి కాంగ్రెస్ కు ఒక్కఛాన్స్ అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక తాగు, సాగునీటి కష్టాలు పోయయన్నారు. 2014లో యాదగిరిగుట్ట ఎట్లుండేదని, ఇప్పుడు ఎట్లుందో ఆలోచించుకుంటే తెలంగాణ వస్తే ఏం అభివృద్ధి జరిగిందో అర్థమవుతుందన్నారు. యాదగిరిగుట్ట టెంపుల్ గురించి యావత్ ప్రపంచం చర్చించుకునే విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశాడని, తిరుపతి స్థాయికి యాదాద్రి క్షేత్రం చేరుకుందన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధితో కొందరికి అన్యాయం జరిగింది వాస్తవమేనన్నారు.‌



కొండపైకి ఆటోలు వెళ్లేలా ఆటో డ్రైవర్లకు డిసెంబర్ 3న తర్వాత శుభవార్త చెప్తామన్నారు. డిసెంబర్ 3న గొంగిడి సునీత ఆలేరు ఎమ్మెల్యేగా మూడోసారి గెలవబోతుందని, ఈ సభ గొంగిడి సునీత గెలుపు విజయోత్సవ సభగా తలపిస్తోందన్నారు. డిసెంబర్ 3 తర్వాత కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు వస్తాయని వీటితో పాటు మరో 4 కొత్త పథకాలు కూడ వస్తున్నాయన్నారు. రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడని మండి పడ్డారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ చేస్తామంటున్నని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఢిల్లీ వాళ్లని, ఇక్కడి వాళ్లు ఏం చేయలన్నా కూడ వాళ్ల ఢిల్లీ నాయకుల అనుమతి తీసుకోవాలని, అలాంటి వాళ్లు మన తెలంగాణకు అవసరం లేదన్నారు. అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేస్తామని, సమ్మక్క సారక్క పేర్లపై ప్రతి గ్రామానికి మహిళా సంఘాల భవనాలు నిర్మిస్తామన్నారు.

దాతరుపల్లి వద్ద టూరిజం పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కోరిన విధంగా ఆలేరు నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ కారిడార్‌కు అనుసంధానం చేసి ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. గొంగిడి సునీతను గెలిపిస్తే మాదాపూర్, రఘునాథపురంను మండలాలుగా చేస్తామని, ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తామని, కొండపైకి ఆటోలను అనుమతిస్తామన్నారు. తుర్కపల్లిలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు, ఆలేరులో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బూడిద బిక్షమయ్య గౌడ్ ను చట్టసభల్లోకి తీసుకుపోతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కేటీఆర్ ను "సీఎం సీఎం" అని నినాదాలు చేస్తుండగా సీఎం హైదరాబాదులో ఉన్నాడని బదులిచ్చారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సుదగాని హరిశంకర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్లు, పార్టీ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News