‘పెంచిన కూలి రేట్ల జీవో విడుదల చేయాలి’

సివిల్ సప్లై కార్పొరేషన్ లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు

Update: 2025-01-02 11:55 GMT

దిశ,చౌటుప్పల్ టౌన్ : సివిల్ సప్లై కార్పొరేషన్ లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు పెంచిన కూలీ రేట్ల జీవోను వెంటనే విడుదల చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బచ్చనగోని గాలయ్య డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని సివిల్ సప్లై హమాలీ యూనియన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.రాష్ట్ర వ్యాప్తంగా హమాలీ కార్మికులు ఎగుమతులు దిగుమతులు నిలిపివేసి నిరవధిక సమ్మెను ప్రారంభించారని తెలిపారు.

హమాలీ కార్మికులకు ప్రతి రెండేళ్లకు ఒకసారి కూలీ రేట్లు పెంచడానికి గత ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవో విడుదల చేసిందని... దాని ప్రకారం 2024 సంవత్సరం నుండి హమాలీలకు పెంచిన కూలీ రేట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. జిల్లాలోని చౌటుప్పల్, భువనగిరి, ఆలేరు, మోత్కూరు, రామన్నపేట మండల కేంద్రాల్లోని సివిల్ సప్లై గోదాముల్లో సుమారు 100 మంది కార్మికులు హమాలీలుగా, స్వీపర్లుగా పని చేస్తున్నారని తెలిపారు. హమాలీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వ చౌక ధరల దుకాణాలకు సరఫరా చేయాల్సిన రేషన్ బియ్యం గోదాములకే పరిమితమైందని వెల్లడించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి హమాలీ కార్మికులకు పెంచిన కూలీ జీవో ను వెంటనే విడుదల చేసి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Similar News