త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాం....

మీ గురించి అంతా తెలుసు… దీనిపై కేబినెట్ సమావేశంలో కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది.

Update: 2024-03-13 10:26 GMT

దిశ, తుంగతుర్తి: మీ గురించి అంతా తెలుసు… దీనిపై కేబినెట్ సమావేశంలో కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ మేరకు త్వరలోనే మీకు గుడ్ న్యూస్ చెప్తాం...అంతా సంతోషంగా స్వీట్లు పంచుకోండి....! అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదర్శ రైతుల సంక్షేమ సంఘం ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ఆదర్శ రైతు వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ బుధవారం ఆదర్శ రైతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కసిరబోయిన లింగయ్య యాదవ్ ఆధ్వర్యంలో పలువురు మంత్రిని కలిసి ఒక వినతి పత్రం సమర్పించారు. 2007లో 250 మంది రైతు కుటుంబాలకు ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల మంది ఆదర్శ రైతులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిందని అయితే 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం వారందరిని అకారణంగా తొలగించిందని మంత్రికి వివరించారు.



కాగా 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీ ప్రకారం ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరించాలని కోరారు. దీంతో స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై విధంగా ఆ సంఘం ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహలను ఆదర్శ రైతుల సంక్షేమ సంఘం కలిసి వినతి పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటేశ్వర రావు కార్యదర్శులు అమృతరావు, నీలం రమేష్‌లు పాల్గొన్నారు.


Similar News