Panchayat Secretary : విచారణ పేరుతో కాలయాపన ?
చివ్వెంల మండలంలోని గాయం వారి గూడెంలో ప్రభుత్వం భూమి సర్వేనెంబర్ 194లో సుమారు 280 గజాల భూమి ఉంది.
దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : చివ్వెంల మండలంలోని గాయం వారి గూడెంలో ప్రభుత్వం భూమి సర్వేనెంబర్ 194లో సుమారు 280 గజాల భూమి ఉంది. కాగా అదే గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి గౌరీ దేవి రవీందర్ సూర్యాపేట జిల్లాలోని ఓ మండలంలో విధులు నిర్వహించుకుంటూ జిఓ 59 తో అక్రమంగా ఇల్లు లేకపోయినా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని జూన్ 3 వ తారీఖున దిశ పత్రికలో వార్త ప్రచురించారు. అదేవిధంగా ప్రజావాణిలో సూర్యాపేట జిల్లా నూతన కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కు ఆధారాలతో అందజేసిన చర్యలు తీసుకునే విషయంలో అధికారులు మీనవేషాలు లెక్కిస్తున్నారు.
విచారణ పేరుతో కాలయాపన ?
విచారణ పేరుతో జిల్లా అధికారులు, కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగులు కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదులు చేసినా బాధితులకు న్యాయం జరగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీనిపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. లక్షల విలువచేసే ప్రభుత్వం భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. అదే సామాన్య ప్రజలు ఉండడానికి యిల్లు లేకపోతే ప్రభుత్వం భూములలో గుడిసెలు వేస్తే మంది మార్భలంతో హడావిడి చేసే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఉద్యోగి అనగానే ఎందుకు పట్టించుకోవడం లేదని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.
జిల్లా పంచాయతీ రాజ్ శాఖ పైన గాని ఆ శాఖ ఉద్యోగుల మీద ఎవరైనా ఫిర్యాదులు చేస్తే, ఆరోపణలు వచ్చిన అధికారితో చర్చలు జరిపి ముడుపులు తీసుకోని విచారణ పేరుతో కాలయాపన చేస్తూ విచారణ ప్రక్కత్రోవ పట్టిస్తారానే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నెలలు గడుస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ?
పంచాయతీ కార్యదర్శి గౌరీ దేవి రవీందర్ ను కాపాడడానికి పెద్ద తలకాయలే రంగంలోకి దిగిచర్చలు జరుపుతున్నారని తోటి ఉద్యోగస్తులే గుసగుసలాడుతున్నారు. నూతనంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించి జిల్లాలో తన మార్కును చూపిస్తున్న తేజస్ నందలాల్ పవర్ చివ్వేంల మండలం గాయం వారి గూడెంలో ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న గ్రామపంచాయతీ కార్యదర్శి పైన చర్యలు తీసుకుంటారా లేక విచారణ పేరుతో కాలయాపన చేస్తారోనని జిల్లా ప్రజలు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
వివరణ : ఈ విషయమై సూర్యాపేట డీపీఓ సురేష్ ను వివరణ కోసం ఫోన్లో సంప్రదించగా రెవెన్యూ పరమైన విషయం కాబట్టి నేను ఏమి చెయ్యలేనని చెప్పారు. కలెక్టరే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.