విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. పొంచి ఉన్న ప్రమాదం !

చేతికందే ఎత్తులో విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతున్నా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

Update: 2024-11-07 09:16 GMT

దిశ, కనగల్లు : చేతికందే ఎత్తులో విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతున్నా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లకు మరమ్మతు చేయాలని వారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండలంలోని ధర్వేశిపురం గ్రామంలో ఎల్లమ్మ గుడి వద్ద గ్రామ మాజీ ఉపసర్పంచ్ జీనుకుంట్ల అంజయ్య గౌడ్ పొలంలో విద్యుత్ వైర్లు ఉన్నాయి. స్తంభాల మధ్య దూరం ఎక్కువ ఉంది. దీంతో వైర్లు చేతికందే ఎత్తులో వేలాడుతున్నాయి. ఆ రైతు పొలం సాగుకు వైర్లు ఇబ్బందిగా ఉండడంతో కర్రల సహాయంతో వైర్లను ఎత్తు లేపి ఉంచాడు. శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం వద్ద నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో ఆ కర్రలు ఊడిపోతే అటుగా ఎవరైనా వెళ్ళినా పెద్ద ప్రమాదం పొంచి ఉంది.

గాలులు వీచినప్పుడు రెండు వైర్లు ఒకదానికొకటి తగులుకొని షార్ట్ సర్క్యూట్ సంభవిస్తుందంటున్నారు. తరచూ వైర్లు తెగి పడుతున్నాయని, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని చెబుతున్నారు. వైర్లు పొలంలో పడి రైతులు చస్తేనే స్పందిస్తారా ? అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు వెంటనే పొలంలో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని, అవసరం ఉన్నచోట్ల అదనంగా స్తంభాలను పాతాలని రైతులు కోరుతున్నారు. కాగా ఇలానే గ్రామంలో చాలాచోట్ల వైర్లు కిందికి ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. కొన్నిచోట్ల హైటెన్షన్ వైర్లు కూడా తక్కువ ఎత్తులో ఉన్నాయని, గడ్డి ట్రాక్టర్లు, ఇతర ఎత్తైన వాహనాలు వెళ్లే సమయంలో ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.

Tags:    

Similar News