వరద నీటిలో మునిగి వృద్ధురాలి మృతి.. నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తుల డిమాండ్

ఆర్ అండ్ బీ అధికారులు, కల్వర్టు నిర్మించిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం తోడయ్యి గ్రామంలోకి వరద చేరి, వృద్ధురాలి ప్రాణం తీసిన సంఘటన అడ్డగూడూరు మండలం మానాయికుంట గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

Update: 2024-09-04 06:19 GMT

దిశ, అడ్డగూడూరు: ఆర్ అండ్ బీ (R&B) అధికారులు, కల్వర్టు నిర్మించిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం తోడయ్యి గ్రామంలోకి వరద చేరి, వృద్ధురాలి ప్రాణం తీసిన సంఘటన అడ్డగూడూరు(Addagudur) మండలం మానాయికుంట(Manaikunta) గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..

మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మానాయికుంట గ్రామానికి చెందిన బోడ ఐలమ్మ ( 80) వరద నీటిలో పడి, కొంత దూరం కొట్టుకు పోయి మృతి చెందింది. ఇండ్లకు సమీపంలో నిర్మించిన కల్వర్టు వద్ద పెద్ద పెద్ద మట్టి దిబ్బలు చదును చేయకపోవడం వల్ల గ్రామంలోని వీధుల్లోకి వరద చేరి ఇళ్ల ఆవరణలు జలమయమయ్యాయి. దీంతో అర్ధరాత్రి కాలకృత్యాలకు లేసిన వృద్ధురాలు ఐలమ్మ జారి వరద నీటిలో మునిగి చనిపోయినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఇటీవల ఆర్ అండ్ బీ(R&B) అధికారులు వేసిన నూతన రోడ్డు నిర్మాణం గ్రామానికి కంటే ఎత్తుగా ఉండడంతో వర్షపు నీరు ఎక్కడికి వెళ్ళలేని దుస్థితి నెలకొంది.

దీంతో అధికారులు అసంపూర్ణంగా రోడ్డు పనులు పూర్తి చేసి నీళ్లు సక్రమంగా దిగువకు పోయే ఏర్పాట్లు చేయకపోవడంతోనే వరద గ్రామంలోకి చేరుతుందని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే నీరు గ్రామంలోకి రాకుండా చర్యలు చేపట్టి, వరదలో మునిగి మృతి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బోడ ఐలమ్మ(Boda Ilamma)కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఆర్ అండ్ బీ ఏఈ స్వామిని(AE Swami)  వివరణ అడగ్గా వరదలకు సంబంధించి నీటిపారుదల శాఖ అధికారులు మెయింటెనెన్స్ చూస్తారని మాకు సంబంధం లేదని పేర్కొనడం గమనార్హం.


Similar News