Diarrhea : డేంజర్ డయేరియా కలకలం.. కదిలిన జిల్లా యంత్రాంగం

చింతలపాలెం మండల కేంద్రంలో డయేరియా క్రమం క్రమంగా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు..జిల్లా అధికార యంత్రం కదిలింది. గత

Update: 2024-10-25 14:25 GMT

దిశ ,చింతలపాలెం : చింతలపాలెం మండల కేంద్రంలో డయేరియా క్రమం క్రమంగా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు..జిల్లా అధికార యంత్రం కదిలింది. గత కొన్ని రోజులుగా గ్రామంలో అతిసార విజృంభిస్తుండడంతో..పాటు డయేరియా లక్షణాలతో గురువారం గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందారు. గ్రామంలో నీరు కలుషితమైందని తెలిసిన అధికారులు బయటకు వెల్లడించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు తీవ్ర నిర్లక్ష్యంతో.. వ్యవహరిస్తున్నారని ప్రాణాలు పోతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శిస్తున్నారు. కాగా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా పంచాయతీ అధికారులు, ఆర్ డబ్ల్యూ ఎస్ ( RWS ) అధికారులు, జిల్లా వైద్య అధికారులు గ్రామంలో పర్యటించారు. జడ్పీ సీఈవో ( ZP CEO)అప్పారావు, ఆర్ డబ్ల్యూ ఎస్  ( RWO )అధికారుల తో కలిసి గ్రామంలో నీటి సరఫరాకు ఉపయోగిస్తున్న 36 బోరు పాయింట్లను గుర్తించారు. వాటిలో అతిసార ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న బోరు పాయింట్లను సీజ్ చేసి మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా కు ప్రయత్నించగా గ్రామంలో మిషన్ భగీరథ  పైపులు మొత్తం లీకేజీ లు ఏర్పడి ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. దీంతో ప్రత్యామ్నాయంగా వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో అప్పారావు మాట్లాడుతూ..గ్రామంలో మిషన్ భగీరథ వ్యవస్థ సక్రమంగా లేదని, దీనిపై పూర్తి నివేదిక ప్రభుత్వానికి నివేదిస్తానని తెలిపారు. గ్రామంలో మొత్తం నీటి నమూనాలు సేకరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఆర్ డబ్ల్యు ఎస్ ( RWS ) అధికారులు ఎస్ ఈ వెంకటేశ్వర్లు, ఈఈ లు అరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్, డీఈ లు అభినయ్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ వైద్య అధికారుల నిర్లక్ష్యం... ప్రైవేట్ కు అతిసార బాధితులు

గ్రామంలో అతిసార విజృంభిస్తున్న ప్రభుత్వ వైద్య అధికారుల నిర్లక్ష్యంతో.. అతిసార బాధితులు ప్రైవేటు ఆసుపత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. బాధితులకు సకాలంలో మెరుగైన చికిత్సకు అందించడంలో నిర్లక్ష్యం చూపించడంతో..బాధితులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డయేరియా లక్షణాలతో గొంగిరెడ్డి శేషరెడ్డి (43), చింతల వీరభద్రి (74) గురువారం మృతి చెందిన సంగతి విధితమే. అతి సార బాధితులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే హడలెత్తిపోతున్నారు. దీంతో డిఎంహెచ్వో కోటాచలం శుక్రవారం చింతలపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును సందర్శించారు. ఈ సందర్భంగా..అతిసార తో బాధపడుతున్న వారి నుంచి రక్తపు నమూనాలను, స్టూల్ శాంపిల్ ను సేకరించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆశా కార్యకర్తలతో సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులతో, పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వెంట డిప్యూటీ డిఎంహెచ్ఓ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం డిస్టిక్ సర్వేలను ఆఫీసర్ నాజియా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈనెల 16 నుంచి ఇప్పటివరకు 42 అతిసార బాధితులను చికిత్స అందించామని తెలిపారు. ఈనెల 22న తీసుకున్న నీటి నమూనాలలో ఒక్క బోరు మినహా మిగతావి పూర్తిగా నీరు కలుషితమైందని. బాధితులు ఒకటి రెండు విరోచనాలు అయిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లను సంప్రదించాలని కోరారు.

గత ఐదు సంవత్సరాలుగా పడకేసిన మిషన్ భగీరథ ట్యాంకులు

చింతలపాలెం మండల కేంద్రం లో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పైపులైను పనులు ఇంతవరకు పూర్తి కాకపోవడంతో..గ్రామంలో మిషన్ భగీరథ ట్యాంకులు ఏర్పాటు చేసిన ఫలితం శూన్యం. అదే పైపులైను పూర్తి చేసి కుళాయి కలెక్షన్లు ఇస్తే ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు వచ్చేవి ఈరోజు చింతలపాలెం గ్రామ ప్రజలు అతిసారా వ్యాధి నుంచి కొంతమేర ఉపశమనం ఉండేది. తాగునీటి అవసరాల కొరకు గ్రామ ప్రజలకు ఇప్పటికైనా పైప్ లైన్ పూర్తి చేసి మిషన్ భగీరథ నీరు అందించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.


Similar News