జాతరను రాజకీయం చేయొద్దు: ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డి
ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫ్లెక్సీలు, ఎద్దుల పందాలు జాతరకు వచ్చిన రంగుల రాట్నాల వద్ద సైతం బెదిరింపులకు పాల్పడుతూ వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
దిశ, మేళ్లచెరువు: ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫ్లెక్సీలు, ఎద్దుల పందాలు జాతరకు వచ్చిన రంగుల రాట్నాల వద్ద సైతం బెదిరింపులకు పాల్పడుతూ వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మేళ్లచెరువు శివరాత్రి జాతరలో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి తో కలిసి శనివారం మేళ్లచెరువు శ్రీ ఇష్ట కామేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు వారికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో శివరాత్రి ఉత్సవాలలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పాల్గొనడం జరిగిందని శివరాత్రి జాతరను కూడా రాజకీయాలకతీతంగా ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను గౌరవించి పంపిన ఘనత తనకే దక్కిందన్నారు. బీఆర్ఎస్ పాలకులు ప్రతి విషయాన్ని రాజకీయానికి వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ పరిణామాలన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో రాజకీయంగా సరైన సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.