కృష్ణమ్మ ఉగ్రరూపం.. నిండు కుండలా సాగర్..

వర్షాకాలం వచ్చిందంటే చాలు నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద పర్యాటకుల సందడి మామూలుగా ఉండదు.

Update: 2024-09-01 06:43 GMT

దిశ, నాగార్జునసాగర్ : వర్షాకాలం వచ్చిందంటే చాలు నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద పర్యాటకుల సందడి మామూలుగా ఉండదు. ఈసారి కుండపోత వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున జలాశయానికి నీరు చేరింది. నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. శ్రీశైలం నుంచి ఏకంగా 5 లక్షల 58 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో నాగార్జునసాగర్ జలాశయం 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 26 క్రస్ట్ గేట్లలో 14 గేట్లను 10 అడుగుల మేర, 12 గేట్లను పదిహేను అడుగుల మేరకు ఎత్తి స్పిల్ వే ద్వారా 5లక్షల 26 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయిలో నిండటంతో ఎగువ నుంచి వచ్చే వరదను, అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది. నాగార్జునసాగర్ ప్రస్తుత, పూర్తి నీటిమట్టం 590 అడుగులు ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను, ప్రస్తుత నీటినిల్వ 308.7614 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం ఆధారంగా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు చేపడతున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి ఇంత మొత్తం వరద ప్రవాహం రావడం 2019 తర్వాత ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. మరోవైపు కృష్ణ దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

పర్యాటకుల రాకతో కళకళ..

ఈ రోజు తెలంగాణ‌, ఆంధ్ర నుంచి అధిక సంఖ్యలో ప‌ర్యాట‌కులు చేరుకోవ‌డంతో సాగ‌ర్ ప‌రిస‌రాలు ర‌ద్దీగా మారాయి. ప‌ర్యాట‌కుల సంద‌డి..సాగర్ అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సాగర్ రిజర్వాయర్ గేట్ల నుంచి జాలువారుతున్న కృష్ణమ్మ అందాలను చూస్తూ పర్యాటకులు పరవశిస్తున్నారు. ఒకవైపు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే మరోవైపు సాగర్ జలాశయం వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు.


Similar News