కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ల నిర్మాణం: పటేల్ రమేష్ రెడ్డి
గురుకుల పాఠశాలల్లో మెరుగైన వసతులు, రుచికరమైన, నాణ్యత గల భోజనం అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.
దిశ, సూర్యాపేట టౌన్: గురుకుల పాఠశాలల్లో మెరుగైన వసతులు, రుచికరమైన, నాణ్యత గల భోజనం అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట కస్తూర్బా గాంధీ మైనారిటీ గురుకుల పాఠశాలను రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులు చారుగొండ వెంకటేష్ తో కలిసి ఆయన సందర్శించి,అక్కడ బాలికలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. పాఠశాలలో పరిశుభ్రత పాటిస్తున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు ఇచ్చే మెస్ చార్జిలను ,కాస్మొటిక్ చార్జిలను పెంచారని,బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఇరవై ఎకరాలలో పేద విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు.
తాను కస్తూర్బా మైనారిటీ పాఠశాలను దత్తత తీసుకొని పాఠశాల అభివృద్ధి కోసం తన వంతుగా సాయం అందిస్తున్నట్లు తెలిపారు. స్ప్రెడ్ ఇండియా- సువెన్ ఫార్మా సహకారంతో ఏడు లక్షల రూపాయల వ్యయంతో పాఠశాలకు ప్రహరి గోడ నిర్మాణం చేస్తామన్నారు. పాఠశాలలో తరగతి గదుల కొరత ఉందని, కోటి ఇరవై లక్షల రూపాయలతో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం ఎస్టిమేషన్ రూపొందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో తరగతి గదులను, వంట గదిని పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా బీసీ సంక్షేమ అధికారి గామయ్య, ఎస్ సి సంక్షేమ అధికారి లత, ఎస్ టి సంక్షేమ అధికారి రమేష్ నాయక్, డిఇవొ అశోక్, గురుకుల పాఠశాల స్పెషల్ ఇంచార్జ్ నారాయణమ్మ, డిసిడివొ పూలన్, కౌన్సిలర్ లు మహమ్మద్ షఫి, వెలుగు వెంకన్న, రామ్మూర్తి యాదవ్, రమేష్ నాయుడు, ధర్మా నాయక్, వల్దాసు దేవేందర్ , నిమ్మల వెంకన్న, యాట ఉపేందర్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.