రూ.500 బోనస్‌పై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

రైతుల శ్రేయస్సే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Update: 2024-12-02 14:08 GMT

దిశ, కోదాడ: రైతుల శ్రేయస్సే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి నియోజకవర్గంలో సుమారు రూ.100 కోట్లలతో నూతనంగా నిర్మించనున్న రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కోదాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సన్న ధాన్యం పండించిన రైతులకు రూ.500 ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 9.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రూ.471.31 కోట్ల బోనస్ రైతులకు చెల్లించామని ఆయన అన్నారు.

అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే రాష్ట్రంలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానిదని ఆయన అన్నారు. గత ప్రభుత్వం తమ పదేళ్ల పాలనా కాలంలో ఒక్క డీఎస్సీ నిర్వహించలేదని మంత్రి ఎద్దేవా చేశారు. ఈ నెల 4న పెద్దపల్లిలో నిర్వహించనున్న సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో నాలుగు వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందజేయనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా పారిశ్రామిక ఆధారిత వృత్తి నైపుణ్య కేంద్రాన్ని నెలకొల్పనున్నామని, దాంతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి తరలివస్తున్నారని ఆయన అన్నారు.

మూసీ నది పునరుజ్జీవం, ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటల పునరుద్ధరణ, హైదరాబాద్‌లో నిర్మించనున్న క్రీడా విశ్వవిద్యాలయం, గృహ జ్యోతి, మహాలక్ష్మి, సబ్సిడీ వంటగ్యాస్ తదితర అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఉత్తమ్ ఈ సందర్భంగా ఉటంకించారు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఏకసభ్య కమిషన్ నియమించామని, సామాజిక న్యాయ సాధనలో భాగంగా రాష్ట్రంలో కుల గణన చేపట్టామని ఆయన అన్నారు.

Tags:    

Similar News