రైతు భరోసా ఎగ్గొట్టడానికి రైతులను పక్కదారి పట్టిస్తున్న కాంగ్రెస్.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
దేశంలో అతి చెత్త కేసుల్లో మాజీ మంత్రి కేటీఆర్ పై నమోదైన కేసు తప్ప మరొకటి లేదనీ మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జీ. జగదీష్ రెడ్డి అన్నారు.
దిశ, సూర్యాపేట టౌన్ : దేశంలో అతి చెత్త కేసుల్లో మాజీ మంత్రి కేటీఆర్ పై నమోదైన కేసు తప్ప మరొకటి లేదనీ మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జీ. జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడే బయ్ చోటే బాయ్ కలసి ఏం పనులు చేస్తున్నారో ప్రజలు గమనిస్తూన్నరన్నారు. రైతు భరోసా ఎగ్గొట్టడానికి రైతులను పక్కదారి పట్టించేందుకే కేటీఆర్ పై కేసు పెట్టే చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ డిక్లరేషన్ లో రైతు రుణమాఫీకి ఎలాంటి నిబంధనలు పెట్టలేదనీ ఇప్పుడు నిబంధనలు మాట్లాడుతుండడం విడ్డూరం అన్నారు.
రుణమాఫీ జాబితాను ఫైనాన్స్ సెక్రటరీ సంతకం పెట్టి విడుదల చేయాలన్నారు. రైతులను, కూలీలను విద్యార్థులను, యువకులను ఈ ప్రభుత్వం మోసం చేసుకుంటూ వస్తుందన్నారు. ఏ ఊర్లో ఎంత రుణమాఫీ చేశారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ, రైతు భరోసా విషయంలో ఎలాంటి షరతులు లేకుండా కేసీఆర్ ఇచ్చిన విధంగానే రైతులందరికీ వర్తింపజేయాలనీ, రాళ్లు రప్పలకు రైతుబంధు ఇచ్చామని చెబుతున్నా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కొడంగల్ లో, మంత్రులు మధిర ఖమ్మం లో విచారణ చేసి రాళ్లు రప్పలకు ఎక్కడ ఇచ్చామో లెక్క చూపించాలన్నారు. రుణమాఫీ విషయంలో 46 వేల కోట్లు చెప్పి 36 వేల కోట్లు కేటాయించి 26 వేల కోట్లు క్యాబినెట్ లో ఆమోదించి 18 వేల కోట్లను విడుదల చేసి 12 వేల కోట్లను మాత్రమే మాఫీ చేశారన్నారని ఆయన పేర్కొన్నారు.