Collector : హడలెత్తించిన కలెక్టర్..

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గురువారం మండల కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు.

Update: 2024-08-01 13:51 GMT

దిశ, నడిగూడెం : జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గురువారం మండల కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ప్రభుత్వ కార్యాలయాలు తెరచుకోవడానికి ముందే మండల కేంద్రానికి వచ్చిన ఆయన సామాజిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, కస్తూర్బా పాఠశాల, రైతు వేదిక, తహశీల్దార్ కార్యాలయంతో పాటు సంపద వనాలను తనిఖీ చేశారు. ఉదయం 9:45 గంటలకే మండలానికి వచ్చిన ఆయన రెండు గంటల పాటు పలు కార్యాలయాలకు తిరుగుతూ అధికారులను హడలెత్తించారు. ముందుగా ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని వైద్యశాలలో సిబ్బంది పనితీరును పరిశీలించారు. అందుబాటులో వున్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి వైద్య సేవలు గురించి ఆరా తీశారు. హాజరు రిజిస్టర్ లను తనిఖీ చేశారు. అప్పుడే డ్యూటీకి వస్తున్న డాక్టర్ ను గమనించిన కలెక్టర్ సమయ పాలన పాటించాలని హెచ్చరించారు.

అక్కడనుంచి నుంచి నేరుగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు నమోదు శాతాన్ని చూసి పాఠశాల మొత్తానికి 60 మంది విద్యార్థులు, పదో తరగతిలో కేవలం నలుగురు మాత్రమే వుండటంతో అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులు హాజరు పట్టికను పరిశీలించిన ఆయన ప్రధానోపాధ్యాయుడిని పలువివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు సమీపంలోని పురుగు మందుల (ఫెర్టిలైజర్స్) దుకాణాన్ని తనిఖీ చేసి స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మందులు కొనుగోలు జరిపిన రైతులకు రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని, ధరల పట్టికను నిర్వహించాలన్నారు. షాపులోని పలు రికార్డులను పరిశీలించారు.

అక్కడి నుంచి నేరుగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఆఫీస్ లోని పలు రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ధరణి లోని సమస్యల పై పలు సూచనలు చేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వెనుక గల కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించిన ఆయన పరిసరాలు అపరిశుభ్రంగా వుండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలు, కూరగాయలను పరిశీలించారు. అనంతరం తరగతిలోకి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించి సామర్ధ్యాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు సరిపడా సిబ్బంది లేరని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం పక్కన వున్న రైతు వేదిక లోకి వెళ్లి రుణమాఫీ వివరాలను అధికారులను అడిగారు. అక్కడే వున్న కొందరు రైతులు తమకు రుణమాఫీ జరగలేదని కలెక్టర్ కు చెప్పడంతో బ్యాంక్ వివరాలను తెలుసుకున్న ఆయన పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు రూ. 1.50 లక్షల లోపు రుణాలు మాత్రమే మాఫీ జరిగిందని తెలిపారు. అందులో సాంకేతిక సమస్య మూలంగా కొందరు రైతుల రుణమాఫీ నిధులు ఆయా బ్యాంక్ ఖాతాలలో జమ కాలేదని, త్వరలో సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. అక్కడ నుండి బయలుదేరిన ఆయన సాగర్ ఎడమ కాలువ కట్ట పై ఏర్పాటు చేసిన సంపద వనాన్ని సందర్శించి మొక్కలు ఎండిపోవడాన్ని చూసి అధికారుల పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండిన మొక్క ప్రాంతంలో కట్టె పుల్ల వుండటాన్ని గమనించిన ఆయన సంపద వనాల నిర్వహణ సరిగా లేదని, మొక్కలకు నిరంతరం నీరు అందించడం లేదని ఉపాధి సిబ్బంది పై అసహనం వ్యక్తం చేశారు. ఎండిన మొక్కల స్థానంలో తిరిగి కొత్త మొక్కలను నాటాలని ఆదేశించారు. పనితీరు మార్చుకొని యెడల చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సయ్యద్ ఇమామ్, ఇమామ్, ఎంపీఓ దుర్గా ప్రసాద్, డీటీ హేమలత తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News