సిబ్బంది అందరూ సెలవు పై వెళ్తే రోగులకు వైద్య సేవలు ఎలా ?
వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో నమ్మకంతో వచ్చే రోగులకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో వుంటూ మెరుగైన వైద్యం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.
దిశ, రామన్నపేట : వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో నమ్మకంతో వచ్చే రోగులకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో వుంటూ మెరుగైన వైద్యం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రామన్నపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి, ఎంత మంది సిబ్బంది ఉన్నారని, ఆబ్సెంట్ అయిన సిబ్బందిని గురించి ఆరా తీశారు. డాక్టర్ వి.ఆదిలక్ష్మి సంవత్సరం నుండి విధులకు హాజరు కాకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగించడానికి ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 60 శాతం మంది సిబ్బందికి లీవు మంజూరీ చేసిన సూపరింటెండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది అందరూ లీవ్ పై వెళ్తే హాస్పిటల్ కు వచ్చే రోగుల పరిస్థితి ఎవరు పట్టించుకుంటారని సుపరింటెండెంట్ ని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ వార్డును పరిశీలించారు. అత్యవసర విభాగం సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలన్నారు. ఓపీ రిజిస్టర్ ను కూడా పరిశీలించారు. ఫార్మసీలో మందుల స్టాక్ గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో ల్యాబ్ లో ఏఏ టెస్టులు నిర్వహిస్తున్నారని ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు టెస్టుల కోసం ప్రైవేటు ల్యాబ్ లకు పంపిస్తే చర్యలు తీసుకుంటారన్నారు. వైద్య సదుపాయాల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది పేషెంట్లు వస్తారని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మందుల కొరత లేకుండా చూడాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రికి వచ్చిన పేషంట్లతో కలెక్టర్ మాట్లాడుతూ వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పేషెంట్ లకు అందుబాటులో లేని చికిత్సలు పేషెంట్ లను హైదరాబాద్ కు రిఫర్ చేయాలన్నారు. గైనకాలజిస్ట్ డాక్టర్ ను వెంటనే నియమించాలని డీసీహెచ్ఎస్ చిన్న నాయక్ ను ఆదేశించారు. ఆసుపత్రిలో ఏ అవసరం ఉన్నా తనకు నివేదిక ద్వారా పంపిస్తే వెంటనే మంజూరు చేస్తానని తెలిపారు. హాస్పిటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన సేవలు అందించాలని ఆసుపత్రి నిర్వహణ మెరుగ్గా ఉండాలన్నారు. హాస్పిటల్ డైట్ చార్ట్ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఆయన వెంట ఆసుపత్రి సుపరింటెండెంట్ డాక్టర్ ఈశ్వర్, డాక్టర్ వరుణ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.