ధరణితో చాలా సమస్యలు.. ప్రక్షాళన చేస్తేనే మేలుః ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

Update: 2024-08-24 13:51 GMT

దిశ, యాదాద్రి కలెక్టరేట్ః రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి ప్రజలకు మేలు చేసే మంచి రెవెన్యూ విధానం తేవడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇది గొప్ప నిర్ణయమని శాసనమండలి సభ్యులు చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) అన్నారు. శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో తెలంగాణ హక్కుల రికార్డు బిల్లు 2024 ముసాయిదాపై రైతులు, అడ్వకేట్లు, వివిధ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సేవకులు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ హక్కుల రికార్డు బిల్లు-2024 ప్రజల అభిప్రాయాలను సేకరించి, చట్ట రూపంలో అమలు చేసే ప్రక్రియ గొప్పదన్నారు. ఇది ప్రజల ఓటు రూపంలో జరుగుతున్న అభిప్రాయమని, ప్రజలు రెవెన్యూ వ్యవస్థపై తమ అభిప్రాయం తెలియజేస్తున్నారన్నారు. ధరణిపై రకరకాల సమస్యలు ఉన్నాయని, ధరణి ద్వారా రెవెన్యూ వ్యవస్థ చిన్నాభిన్నమైందని, దీనిని సరిచేయాలన్నదే ప్రభుత్వం ఆలోచన అని, ఇది ప్రజా ప్రభుత్వమని అన్నారు. స్విట్జర్లాండ్ దేశంలో ప్రజలు ఒప్పుకుంటేనే చట్టం అవుతుందని, ప్రజలు కోరుకున్న చట్టాలు వస్తేనే మంచిదని, ఇలాంటి సమావేశాల వలన పరిష్కారాలు లభిస్తే విజయవంతమైనట్లేనని అన్నారు.

కలెక్టర్ హనుమంత్ కే.జెండగే మాట్లాడుతూ భారతదేశంలో భూమి అంటే ఒక ఎమోషనల్ బంధమని, అలాంటి భూమి విషయంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా, వారికి మేలు జరిగేలా కొత్త రెవెన్యూ యాక్ట్ పై మీరు అందించే సూచనలు, సలహాలను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. తహసీల్దార్ నుండి జిల్లా కలెక్టర్ వరకు అప్పీల్ వ్యవస్థ ఉండాలని చిన్న సమస్యలకు కూడా హైదరాబాద్ సిసిఎల్ఏ కార్యాలయం వెళ్లకుండా ఇక్కడే పరిష్కరించబడాలని రిటైర్డ్ ఎమ్మార్వో ఉదయ్ కుమార్ అన్నారు. ధరణిలోని లోపాల సవరణకు కొత్త యాక్ట్ లో రూల్స్ ఫ్రేమ్ చేస్తే బాగుంటుందన్నారు. ధరణి తిరిగి సమీక్షిస్తే వేల కోట్ల విలువ గల ప్రభుత్వ భూములు తిరిగి పొందవచ్చన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ పి. బెంషా లోమ్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కే.గంగాధర్, రెవెన్యూ డివిజనల్ అధికారులు అమరేందర్, శేఖర్ రెడ్డి కొత్త చట్టంలో పొందుపరచిన అంశాలను వివరించారు.

Tags:    

Similar News