పెంచిన టోల్ టాక్స్ ను ఉపసంహరించుకోవాలి : సీఐటీయూ
కేంద్రం పెంచిన టోల్ టాక్స్ లను ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డిలు డిమాండ్ చేశారు.
దిశ, మిర్యాలగూడ : కేంద్రం పెంచిన టోల్ టాక్స్ లను ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డిలు డిమాండ్ చేశారు. శనివారం స్థానికంగా మాట్లాడుతూ కిలోమీటర్ కి మూడు రూపాయల చొప్పున టోల్ ట్యాక్స్ పెంచడం వల్ల వాహనదారుల పై ఆర్థికభారం పెరుగుతుందన్నారు. నిత్యావసర వస్తువులు రవాణా చేసే వాహనాలపై భారం పడడంతో రవాణా, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంటుందని వాపోయారు.
సగటున 4.5 శాతం టాక్స్ లు పెంచడం పేద ప్రజల పై భారం మోపడమేనని, నిత్యవసర ధరలు పెరిగి సామాన్య ప్రజలు అల్లాడుతుంటే టోల్ ట్యాక్స్ ధరలు పెంచడం విడ్డూరంగా ఉందన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ప్రజలపై భారాలు మోస్తూ కార్పొరేట్లకు రాయితీలు ఇస్తుందని విమర్శించారు. దేశంలో పేదప్రజల జీవన పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. ఉపాధి లేక పెరిగిన ధరలతో జీవనం కష్టంగా మారిందని, తక్షణమే టోల్ పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కన్వీనర్ తిరుపతి రామ్మూర్తి టూ టౌన్ కార్యదర్శి భవాండ్ల పాండు, రాగిరెడ్డి మంగా రెడ్డి, గుణగంటి రాంచంద్రు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.