జోరుగా గొలుసుకట్టు దందాలు..

"ఎదుటి వారిని బురిడీ కొట్టించడంలో ఆరితేరిన నైపుణ్యం.. పోలీసుల చేతికి చిక్కినా తొణకని నిజం..

Update: 2024-11-21 02:23 GMT

"ఎదుటి వారిని బురిడీ కొట్టించడంలో ఆరితేరిన నైపుణ్యం.. పోలీసుల చేతికి చిక్కినా తొణకని నిజం.. ఇంత చాకచక్యంగా వ్యవహరించే వారు ఏ దోపిడీ దొంగలో.. సుపారి ముఠా లాంటి కరుడుగట్టిన నేరస్థులో కాదు... తమ మాటలే డబ్బు మూటలుగా.. అమాయకుల ఆశలే వారి పెట్టుబడిగా ఈ దందా కొనసాగిస్తున్నారు. ఉపాధి కల్పన పేరుతో తీయటి మాటలు.. ఎదుటివారిని ఇట్టే బోల్తా కొట్టించే టంత నేర్పరితనం వారి సొంతం. ఇంతకీ వాళ్లు ఎవరని అనుకుంటున్నారా ? వారేనండీ... అమాయక ప్రజలను తమ మాయ మాటలతో బుట్టలో వేసుకుంటూ మల్టీలెవెల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) గొలుసుకట్టు వ్యాపారాలు చేసే ప్రతినిధులు. అధిక వడ్డీలు ఆశ పెట్టి అమాయక ప్రజల నుంచి కోట్లు కొల్లగొట్టే ఘనులు. గొలుసుకట్టు దందాలు జోరుగా సాగిస్తూ.. తాము అనుకున్నంత సొమ్ము చేతికి చిక్కగానే బోర్డు తిప్పేసి సామాన్య ప్రజల ఆశలను వమ్ము చేసే దుర్మార్గులు.

గొలుసుకట్టు వ్యాపారాలతో సామాన్య ప్రజలను బురిడీ కొట్టించి ఎవరికీ చిక్కకుండా తప్పించుకుని తిరిగే వారు కొందరైతే.. ఒకవేళ తమ గుట్టు బయటపడి పోలీసుల చేతికి చిక్కినా... ఏమాత్రం జంకు లేకుండా జైలుకెళ్లడానికైనా వెనుకాడడం లేదు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుని సులభంగా జైలు నుంచి బయటపడుతూ సామాన్య ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తూ దర్జాగా తిరుగుతున్నారు ఈ కేటుగాళ్లు.

దిశ, చౌటుప్పల్ టౌన్ : పల్లె.. పట్నం అనే తేడా లేకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అనేక ప్రాంతాల్లో గొలుసుకట్టు దందాలు జోరుగా సాగుతున్నాయి. అధిక వడ్డీలు ఆశ జూపి అనేక మంది అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలు దండుకుంటూ మల్టీ లెవెల్ మార్కెటింగ్ దందాలు యథేచ్ఛగా నడుపుతున్నారు. రూపాయి పెట్టుబడి పెడితే రెండు రూపాయలు లాభం వస్తుందని ఆశతో ఆస్తులు తాకట్టు పెట్టి సదరు సంస్థల్లో పెట్టుబడులు పెడితే.. ఆరు నెలలు గడిచే లోపే బోర్డు తిప్పేసిన సంస్థలు కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. దీంతో తమ ఆశలే పెట్టుబడిగా ఉన్నదంతా ఊడ్చి పెట్టిన అమాయకులు ఈ మోసగాళ్ల బారిన పడి సర్వం కోల్పోయిన సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. అత్యాశకు పోయి చాలా మంది సామాన్య ప్రజలు మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థలను గుడ్డిగా నమ్ముతున్నారు. తమ లక్ష్యం మేర సొమ్ము సమకూరగానే ఆయా సంస్థలు బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కొత్త కొత్త ఎత్తులతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటీవల వెలసిన అనేక మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థలు గుట్టుగా తమ వ్యాపారాన్ని చేస్తూ బోర్డులు తిప్పేసి కోట్ల రూపాయల డబ్బు కొల్లగొట్టాయి.

అవగాహనతోనే మోసాలకు అడ్డుకట్ట..

గొలుసుకట్టు మల్టీ లెవెల్ మార్కెటింగ్ వ్యాపారాల పై పల్లెటూరు జనాలకు అవగాహన లేకపోవడంతోనే తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధిక శాతం వడ్డీ ఇస్తామని నమ్మబలికి... కొన్ని నెలలపాటు సక్రమంగా చెల్లింపులు చేస్తుండడంతో వారిని జనాలు గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు ఇలా సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మాయగాళ్ల వలలో పడి మోసపోతున్నారు. ఉన్నదంతా ఊడ్చుకొచ్చి సదరు సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఆరు నెలలు తిరిగేలోపే ఆ సంస్థ నిర్వహకులు బోర్డు తిప్పేసి ఎవరికీ కనిపించకుండా పారిపోతుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే బాధితులు అనేకం..

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అనేక సంస్థలు నెలకొల్పి మల్టీ లెవెల్ మార్కెటింగ్ దందాలు నిర్వహించారు. పోలీసుల నిఘాకు చిక్కకుండా గుట్టుగా తమ దందాను కొనసాగించి అమాయక ప్రజల నుంచి కోట్లు కొల్లగొట్టిన ఉదంతాలు అనేకం వెలుగు చూశాయి. ఇలాంటి గొలుసు కట్టు దందాల్లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయిన బాధితులు వేల సంఖ్యల్లోనే ఉండటం గమనార్హం.

మోసం చేసిన సంస్థలు మచ్చుకు కొన్ని..

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ దందా పేరుతో జనాలను మోసం చేసిన సంస్థలు అనేకం ఉన్నాయి. గత రెండేళ్ల క్రితం వెలసిన ఐపీజీ అనే ఆన్లైన్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థలో పెట్టుబడులు పెట్టి కోట్లాది రూపాయల డబ్బు పోగొట్టుకున్న బాధితులు వేల సంఖ్యలోనే ఉన్నారు. బాధితులంతా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినా నేటి వరకు ఏ ఒక్క నిందితుడూ పోలీసులకు చిక్కలేదు. అదేవిధంగా.. గత రెండేళ్ల క్రితం హైదరాబాద్ కేంద్రంగా పుట్టుకొచ్చిన 'పుడమి ఇన్ఫ్రా ప్రాజెక్టు' అనే రియల్ ఎస్టేట్ సంస్థ బై - బ్యాక్ వ్యాపారం పేరుతో అమాయక ప్రజల నుంచి సుమారు రూ. 205 కోట్లు వసూలు చేసింది. ఏడాదిలోపే నిర్వాహకులు బోర్డు తిప్పేశారు. ఇందులో పెట్టుబడులు పెట్టిన వారు సుమారుగా 3200 మంది ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ వనస్థలిపురం కేంద్రంగా తన్విత, జనని రేపో ప్రాజెక్టుల పేరుతో మరో రెండు వేర్వేరు కార్యాలయాలు ప్రారంభించిన కొందరు కేటుగాళ్లు బై - బ్యాక్ పేరుతో వందల కోట్లు కొల్లగొట్టినట్టు సమాచారం. ఈ సంస్థలోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సామాన్య ప్రజలే బాధితులుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయా సంస్థల్లో డబ్బులు చెల్లించి మోసపోయిన బాధితులు ఏం చేయాలో.. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సంస్థ ఇచ్చే లాభాలు దేవుడెరుగు.. తాము పెట్టుబడిగా పెట్టిన డబ్బులైనా తిరిగి ఇస్తే చాలు అంటూ బాధితులంతా సంస్థ నిర్వాహకుల జాడ కోసం వెతుకుతున్నారు.

ఇలాంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టి మోసపోతున్న వారిలో గ్రామీణ ప్రాంత మధ్యతరగతి, నిరుపేదలే అధికంగా ఉండటం గమనార్హం. ఇప్పటికైనా ఇలాంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థలు నిర్వహించే దందాల పై పోలీసులు గట్టి నిఘా వేసి ప్రారంభ దశలోనే చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి గొలుసు కట్టు మోసాలకు అడ్డుకట్ట పడే అవకాశం లేదు.


Similar News