మీడియా పాత్ర ప్రజా ప్రయోజనం దిశగా సాగాలి: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

సంచలన కథనాల కోసం కాకుండా.. ప్రజా ప్రయోజనాలకు దోహదపడే కథనాలతో మీడియా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2024-11-20 15:00 GMT

దిశ, చౌటుప్పల్ టౌన్: సంచలన కథనాల కోసం కాకుండా.. ప్రజా ప్రయోజనాలకు దోహదపడే కథనాలతో మీడియా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణం వలిగొండ రోడ్డులోని ఎస్.ఎం రెడ్డి గార్డెన్‌లో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన చౌటుప్పల్ మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు జర్నలిస్టులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల పక్షపాతిగా వ్యవహరిస్తూ.. మీడియా స్వేచ్ఛగా తన బాధ్యతలను నిర్వర్తించేందుకే ఫోర్త్ ఎస్టేట్‌గా పిలువబడుతోందన్నారు.

అయితే, సమాజ శ్రేయస్సు కోసం గతంలో మీడియా పోషించిన పాత్రకు.. ప్రస్తుతం పోషిస్తున్న పాత్రకు ఎంతో తేడా ఉందన్నారు. వ్యాపార కోణంలో మీడియాను కొనసాగిస్తే ప్రజల ఆకాంక్షాలకు అనుగుణంగా సమాజానికి మేలు చేయలేరని తెలిపారు. భావ వ్యక్తీకరణకు సోషల్ మీడియా పురుడు పోసుకోవడం శుభ పరిణామమే అయినప్పటికీ, ఆ స్వేచ్ఛను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం సహించరానిదన అన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం మీడియా అకాడమీ తన వంతు కృషి చేస్తుందన్నారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఆరోగ్య పథకం, ఇంటి స్థలాలు, ఇండ్లు అందించే దిశలో కృషి చేస్తున్నట్లు శ్రీనివాస్ రెడ్డి భరోసానిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ మాట్లాడుతూ.. నాడు ఉమ్మడి రాష్ట్రంలో, నేడు తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల గొంతుకగా పనిచేస్తున్న ఏకైక సంఘం తమదేనన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో 50 ఏళ్ల నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తూ.. జాతీయ స్థాయిలో జర్నలిస్టుల గొంతుకగా నిలిచిన శ్రీనివాస్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్‌గా కొనసాగడం శుభపరిణామమని అన్నారు.

స్థానిక మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు చౌటుప్పల్‌లో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు, ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఐజేయూ జిల్లా ఉపాధ్యక్షుడు దోనూరు రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.నరసింహులు, పోతంశెట్టి కరుణాకర్, యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎలిమినేటి ఇంద్రారెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు మల్లేశం, జర్నలిస్టుల ఆరోగ్య కమిటీ సభ్యులు జహంగీర్, జిల్లా ఉపాధ్యక్షులు దోనూరు రాంరెడ్డి, సీనియర్ రిపోర్టర్లు సుర్కంటి మహేందర్ రెడ్డి, పందుల నరసింహ, చిదుగుళ్ల జంగయ్య గౌడ్, దొడ్డి రాములు, ఉబ్బు లింగస్వామి, దోనూరు జగన్ రెడ్డి, పోలోజు శ్రీనివాసచారి, బొమ్మ మల్లేష్, ఊదరి శ్యామ్ సుందర్, కొత్తోజు కుమారస్వామి, బొల్లోజు సందీప్, బొడిగె ప్రభాకర్, బోదుల నరేష్, సురివి కిరణ్, లింగా నాయక్, ఎండి రఫీ, చిలివేరు సంజీవ, కలకొండ సంజీవ తదితరులు పాల్గొన్నారు.


Similar News