వెలుగుల మాటున చీకటి దందా...కాసులకు కక్కుర్తి పడి..!

గ్రామాలలో విద్యుత్ దీపాల ఏర్పాటు పేరుతో ఖర్చు చేస్తున్న ప్రభుత్వ సొమ్ములో కాంట్రాక్టర్లు అక్రమ దందా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి...

Update: 2024-09-17 02:56 GMT

దిశ, నల్లగొండ బ్యూరో: గ్రామాలలో విద్యుత్ దీపాల ఏర్పాటు పేరుతో ఖర్చు చేస్తున్న ప్రభుత్వ సొమ్ములో కాంట్రాక్టర్లు అక్రమ దందా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనను తుంగలో తొక్కి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నారని, దానివల్ల ప్రజలకు నష్టంతో పాటు గ్రామాల్లో అనుకున్న స్థాయిలో వెలుగులు ఉండడం లేదని ఆరోపణలు ఉన్నాయి. నిబంధలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు కాసులకు కక్కుర్తి పడి ఎంబీ రికార్డ్స్ చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. గరిడేపల్లి మండలంలో నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద రూ.1.15కోట్లు నిధులను కేవలం ఐమాక్స్ విద్యుత్ దీపాల ఏర్పాటు కోసమే 2022-2023 ఆర్థిక సంవత్సరం కింద నిధులను కేటాయించారు.వీటిలో 50 లక్షలు కాంట్రాక్టర్ దండుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ మొత్తం బడ్జెట్ను ఓకే మండలానికి మూడు విభాగాలుగా చేసి విభజించి కేటాయించారు. వాటిలో ఒకే ప్రోసిడింగ్ నెంబర్ 581తో మొదటగా రూ.55లక్షలు, రెండోసారి రూ.50 లక్షలు, మూడోసారి రూ.10 లక్షలు విడుదల చేశారు.

మూడు దఫాలుగా బడ్జెట్ విడుదల.....

2022 -23 బడ్జెట్లో నాటి ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ ( నామినేటేడ్) నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద హుజూర్నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలంలోని గ్రామాలలో హైమాక్స్ విద్యుత్ స్తంభాలు, దీపాలు ఏర్పాటు చేయడం కోసం మూడు దఫాలుగా విడుదల చేశారు. వాటిలో మొదటగా రూ.55 లక్షల నిధులను కేటాయించారు. ఇందులో గానుగు బండ గ్రామ పంచాయతీ పరిధిలో రూ. 10 లక్షలు, కుతుబ్ షాపురం గ్రామంలో రూ.10లక్షలు, కొత్తగూడెంలో రూ.10లక్షలు, కొనాయ గూడెం రూ.10లక్షలు, ఎల్. బి. నగర్ రూ.5లక్షలు, వెంకటాపురం రూ.5లక్షలు, లక్ష్మి పురం రూ.5లక్షలు కేటాయించారు.,.

రూ.50లక్షలు ఐమాక్స్ విద్యుత్తు దీపాల కోసమే....

వెంకటాపురం రూ.4 లక్షలు, రామచంద్ర పురం రూ.6లక్షలు, మల్లయ్య గూడెం రూ.6లక్షలు, గరిడేపల్లి రూ.10లక్షలు, సర్వారం రూ.12లక్షలు, కొనాయగూడెం రూ.6లక్షలు, మర్రి కుంట రూ.6లక్షలు నిధులు కేటాయించారు. రూ.10లక్షలు హైమాక్స్ లైట్లు కోసం... గరిడేపల్లి మండలంలో రామచంద్రాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఐమాక్స్ విద్యుత్ దీపాల కోసం రూ. 10 లక్షలు బడ్జెట్ కేటాయించారు.

హైమాక్స్ దీపాల ఏర్పాటు ఇలా.... ఒక్క ఐమాక్స్ విద్యుత్తు స్తంభం ఏర్పాటు చేయాలంటే రూ.1.50 లక్షల నుంచి రూ.1.70లక్షల వరకు ఖర్చవుతుంది. మూడు స్తంభాలు ఏర్పాటు చేయాలంటే రూ.5 లక్షల వరకు ఎస్టిమేషన్ ఉంటుంది.. ఒక్క విద్యుత్ స్తంభానికి 6 లైట్లు బిగించాలి. విద్యుత్ పోల్ ఏర్పాటు చేసిన తర్వాత ఎర్త్ వైర్ బిగించాలి ఫౌండేషన్, శిలాఫలకం కూడా ఉండాలి.. పనులు పూర్తయిన తర్వాత ఐదేళ్ల వరకు పనులు చేసిన కాంట్రాక్టర్‌దే గ్యారెంటీ.

నిబంధనలు తుంగలో తొక్కి....

ఐమాక్స్ విద్యుత్ దీపాల ఏర్పాట్లు కాంట్రాక్టర్ పూర్తిగా నిబంధనలు తొక్కాడని విమర్శలు ఉన్నాయి. ఒక్కొక్క విద్యుత్ పోలుకు 6 లైట్లు ఏర్పాటు చేయాలి కానీ 3 నుంచి 4 మాత్రమే దీపాలు ఏర్పాటు చేశారు. ఏ విద్యుత్ స్తంభానికి కూడా ఎర్త్ వైర్ బిగించలేదు, స్తంభానికి ఫౌండేషన్, ఫౌండేషన్ స్టోన్ కూడా లేదు. ఎర్త్ వైర్ లేకపోతే విద్యుత్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది. మనుషులు లేదా జంతువులు తెలిసి తెలియక విద్యుత్ స్తంభాన్ని ముట్టుకుంటే కరెంట్ షాక్ తగిలి చనిపోయే ప్రమాదం ఉంది. అవేమి లెక్కచేయకుండా కాంట్రాక్టర్లు అధికారులు పనులు ముగించేశారు.. అయితే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసిన వారం రోజులులోపే మెజార్టీ ఐమాక్స్ దీపాలు పగిలిపోయినట్లు ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు .ఇప్పటికి కూడా వాటి స్థానంలో కొత్త దీపాలు వెలిగించింది లేదు కాంట్రాక్టర్ను ప్రశ్నించిన అధికారి లేడు. లక్షలు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్లు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఐమాక్స్ విద్యుత్ దీపాల కు ఫౌండేషన్ స్టోన్ పెట్టకుండానే డిజిటల్ తెలివితేటలతో అధికారులకు సమర్పించే రికార్డులక సంబంధించిన ఫొటోలలో మాత్రం ఫౌండేషన్, ఫౌండేషన్ స్టోన్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.

మొత్తంగా హైమాక్స్ విద్యుత్ దీపాల కాంట్రాక్టర్ రూ.50 లక్షలకు పైనే ఈ పనులను నిబంధనలకు విరుద్ధంగా చేసి అక్రమాలకు పాల్పడ్డాడని విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాంట్రాక్టర్ చేసే అక్రమాలకు ఎంబీ రికార్డు చేసిన అధికారులు కూడా వత్తాసు పరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.

కాసులకు కక్కుర్తి పడి...?

హైమాక్స్ విద్యుత్ స్తంభాల పనితీరును పరిశీలించి ఎంబీ రికార్డ్స్ చేయాల్సిన పంచాయతీరాజ్ అధికారులు పనులు తనిఖీ చేయకుండానే రికార్డ్స్ లో నమోదు చేసినట్లు తెలుస్తుంది. గంగాధర్ అనే కాంట్రాక్టర్ అధికారులను అనేక ప్రలోభాల గురిచేసి పనుల్లో నాణ్యత నిబంధనల ప్రకారం లేకుండానే ఎంబీ రికార్డు చేయించుకొని చేతులు దులుపుకున్నారని విమర్శలు ఉన్నాయి.. గతంలో ఏర్పాటుచేసిన ఐమాక్స్ విద్యుత్ స్తంభాలను కూడా ఈ బడ్జెట్ కిందనే పనులు చేసినట్లు కూడా ఇంజనీరింగ్ అధికారులు ఎంబీ రికార్డ్స్‌లో నమోదు చేసినట్లు సమాచారం.

ఒకే మండలానికి భారీ నిధులా....?

శాసనమండలి, రాజ్యసభ సభ్యులు తమ బడ్జెట్‌ను రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలోనైనా ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. అవి కూడా భారీ మొత్తంలో కాకుండా రూ. 20 నుంచి 30 లక్షల వరకు కట్ చేసే అవకాశం ఉందని వీనికిడి. కానీ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ నియోజకవర్గ నిధుల నుంచి రూ.1.15కోట్లు నిధులు కేవలం విద్యుత్ దీపాల కోసమే కేటాయించడం అనేది కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ స్థాయిలో నిధులు కేటాయించడం వెనక భారీ అవినీతికి కూడా తెర లేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


Similar News