అక్రమ సంబంధం నెపంతో హత్య..ఆరుగురు నిందితుల అరెస్ట్

భార్య మరొక ఓ వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్నదన్న

Update: 2024-09-18 15:26 GMT

దిశ , సూర్యాపేట : భార్య మరొక ఓ వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్నదన్న నెపంతో భర్త మరి కొంతమందితో కలిసి ఆ యువకుడిని హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నట్లు డీఎస్పీ జి.రవి తెలిపారు.ఈనెల 10న జరిగిన హత్య కేసు వివరాలను బుధవారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు.ఈనెల 10న నాగారం మండలం డి.కొత్తపల్లి గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ గట్టున తిరుమలగిరి కి చెందిన కిరణ్ అనే యువకుడి మృతదేహం లభించిందని చెప్పారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు పత్తేపురం విజయ్ స్వస్థలం తిరుమలగిరి పట్టణం. ఆయనకు దేవరుప్పుల మండలం గొల్లెపల్లి గ్రామానికి చెందిన యాదగిరి కూతురు సుమలతతో ఆరు సంవత్సరాల క్రితం వివాహమైంది.

ఆమె తన తండ్రి చనిపోయిన కారణంగా తండ్రి ఇంటి వద్దనే ఉంటుంది. కాగా విజయ్ కి భార్య సుమలతపై ఎప్పటి నుండో అనుమానం ఉంది.దానికి కారణం కిరణ్ కుమార్ అని భావించాడు.అందుకు కిరణ్ ను ఎలాగైనా అంతమొందించాలని ప్లాన్ వేశాడు.అందుకు తన సొంత బావ అయిన దుర్గం సైదులుకి విషయం చెప్పాడు. ఆయనతో పాటు బంధువులైన దుర్గం బాబు,మామిడి ఎల్లయ్య, స్నేహితులు అయిన వడ్డే పున్నం,చంద్రశేఖర్ లను తిరుమలగిరికి పిలిపించి అక్కడే ఓ ఎస్టేట్ నందు కిరణ్ ని చంపడానికి పథకం రచించారు. ఆ పథకం ప్రకారం ఈనెల 10న పత్తేపురం విజయ్ తన బావతో కలిసి మృతుడు కిరణ్ కోసం రెక్కీ నిర్వహించారు. దాని ప్రకారమే శ్రీకాంత్ అనే వ్యక్తి వద్దనున్న స్విఫ్ట్ డిజైర్ కారును సెల్ఫ్ డ్రైవింగ్ గా తీసుకున్నాడు.

ఇందులో భాగంగానే తిరుమల ఆయిల్స్ సీసీ రోడ్డు వద్ద ఇద్దరు నిందితులు పున్నం,చంద్రశేఖర్ లు బైక్ పై వెళ్ళారు. కిరణ్ బైక్ పై వస్తున్న క్రమంలో కారు అడ్డుపెట్టి ఆపి వెనుక నుండి చేపల కత్తితో దాడి దాడి చేశారు.అనంతరం అక్కడి నుండి కారులో ఎక్కించి డి.కొత్తపల్లి ఎస్సారెస్పీ కాలువ గట్టు మీద హత్య చేసి పారిపోయారు.ఈనెల 17న నిందితులంతా నకిరేకల్ మండలం కాసనగోడు,బొప్పారం గ్రామాల సమీపంలో నాగారం సీఐ రఘువీరా రెడ్డి,ఎస్సై ఐలయ్యలు తన సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు.విచారణ నిమిత్తం వారు విజయ్ భార్య సుమలతతో కిరణ్ కుమార్ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడనే కారణంతోనే అతన్ని హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని డీఎస్పీ వివరించారు.ఈ ఛేదనలో బాగా పని చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అభినందించినట్లు డీఎస్పీ వెల్లడించారు.


Similar News