ఐలమ్మ పోరాటస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంత్ కె. జెండగే అన్నారు.

Update: 2024-09-26 10:38 GMT

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంత్ కె. జెండగే అన్నారు. గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా భూమి, భుక్తి కోసం చేసిన పోరాటాలను గుర్తుచేస్తూ వారి ఆశయాలను సాధించేందుకు కృషి చేయాలని, తద్వారా సమాజాభివృద్ధికి తోడ్పడినట్లు అవుతుందని అన్నారు.

    వారి పోరాటాలు, ఆశయాలు అందరికీ తెలియాలని రాష్ట్ర ప్రభుత్వం ఆమె జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ సంఘాల ప్రతినిధులు వీరనారి చాకలి ఐలమ్మ పోరాటాలు, పోరాటం కోసం ఆమె చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ జయంతి వేడుకలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి.బెన్ షాలోమ్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యాదయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News