దారుణం.. కొడుకుతో కలిసి భర్తను దారుణంగా చంపిన భార్య
ఆస్తి తగాదా ఒకరి ప్రాణం మీదికి తీసుకొచ్చింది. కట్టుకున్న భార్య కన్న కొడుకు
దిశ, తుంగతుర్తి: ఆస్తి తగాదా ఒకరి ప్రాణం మీదికి తీసుకొచ్చింది. కట్టుకున్న భార్య కన్న కొడుకు సహకారంతో భర్తను అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఒళ్ళు జలదరించే ఈ సంఘటన కలకలం సృష్టిస్తుంది. గ్రామస్తులు,బంధువులు,పోలీసుల కథనం ప్రకారం ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన మృతుడు భూక్య హార్జ(55)కు భార్య కైకమ్మతో పాటు కుమారుడు సురేష్, కూతురు ఉన్నారు. గత ఏడాది కూతురు వివాహం జరిగింది. అయితే గ్రామంలోనే ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమిని సాగు చేసుకోవడమే కాకుండా అడపాదడపగా ఇతర పనుల కోసం కూలీగా వెళుతుండేవాడు. అయితే అవివాహితుడైన కొడుకు సురేష్ మద్యానికి బానిసై కొంతకాలం నుండి తరచుగా తండ్రితో గొడవపడేవారుడు. దీనికి తోడు చేసిన అప్పులు తీర్చడానికి వ్యవసాయ భూమిని అమ్మాలని తండ్రితో ఘర్షణ పడేవాడు. దీనికి భార్య కైకమ్మ కూడా మద్దతు తెలిపింది.
ఈ పరిస్థితుల మధ్య దాదాపు రెండేళ్ల క్రితమే కుటుంబంతో మృతుడు హర్జా హైదరాబాదుకు వెళ్లారుడు. అయితే అక్కడ కూడా భార్య,కుమారుడి నుంచి వేధింపులు ఆగలేదు. అంతేకాకుండా జరిగిన హత్యాయత్నం నుండి హార్జ తృటిలో తప్పించుకొని ప్రాణాలతో స్వగ్రామానికి చేరాడు. ఈ క్రమంలో మృతుడు హార్జ ఒంటరిగానే రామన్నగూడెంలో ఉంటున్నాడు. అయితే దసరా పండుగను పురస్కరించుకొని భార్య కైకమ్మ,కొడుకు సురేష్ లు రామన్నగూడెం వచ్చారు. ఈ సందర్భంగా ఆస్తులు అమ్మకంపై ఘర్షణ జరిగినట్లు తెలిసింది. అనంతరం గాఢ నిద్రలో ఉన్న హార్జపై ఇంట్లో ఉన్న కూరగాయలు కోసే కత్తితో ముఖంపై తల్లీకొడుకు దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఉదయం ఇంటి తలుపులు తెరవకపోవడంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూసేసరికి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు తుంగతుర్తి పోలీసులకు గ్రామస్తులు సమాచారాన్ని అందించారు. సీఐ వీరబ్రహ్మం, ఎస్సై ప్రవీణ్ కుమార్లు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.