నాగార్జునసాగర్‌లో స్టార్ హోటల్ నిర్మిస్తున్నాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగార్జునసాగర్ బుద్ధవనం ను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి జూపల్లి అన్నారు. పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్‎గా తీర్చిదిద్దుతామని తెలిపారు.

Update: 2024-11-01 13:22 GMT

దిశ, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ బుద్ధవనం ను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి జూపల్లి అన్నారు. పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్‎గా తీర్చిదిద్దుతామని తెలిపారు. నాగార్జునసాగర్ బుద్ధ వనాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు . స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి కలిసి నాగార్జున సాగర్‎లోని హిల్ కాలనీలో ఉన్న బుద్ధవనంలోని వ్యూ పాయింట్ యోగా ధ్యాన కేంద్రాన్ని మంత్రి జూపల్లి సందర్శించారు. నాగార్జునసాగర్, బుద్ధవనం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో స్టార్ హోటల్ నిర్మాణంతో పాటు.. వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద ఉన్న బుద్ధవనం పరిసర ప్రాంతాలను శ్రీ రామచంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కమలేష్ డి.పటేల్ (దాజి )తో కలిసి పరిశీలించారు. ముందుగా విజయ విహర్‌లో బుద్ధవనం లే అవుట్ ,విజయ విహార్ లేఔట్లను పరిశీలించారు. మొత్తం 270 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న బుధవనంలో ఉన్న విశేషాలను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి .ప్రకాష్ రెడ్డి , బుద్ధవనం కన్సల్టెంట్ శివనాగిరెడ్డిలు మంత్రికి, దాజికి వివరించారు.

నాగార్జునసాగర్ ,బుద్ధ వనానికి ఆసియా ఖండంలోని పలు దేశాల నుంచి బౌద్ధులు ఇక్కడికి వస్తారని ,ప్రత్యేకించి శ్రీలంక, ఇతర ఆసియా ఖండాల నుంచి ఎక్కువ మంది వస్తారని ,వారికి అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించాల్సి ఉందన్నారు. అప్పుడు ఇంకా ఇతర దేశాల నుంచి సైతం బౌద్ధులు ఇక్కడికి వచ్చేందుకు అవకాశం ఉందని మంత్రి అన్నారు. బుద్ధవనం పరిసర ప్రాంతాలతో పాటు, విజయ విహార్‌లో ఉన్న స్థలం వివరాలు, అలాగే నాగార్జునసాగర్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములపై సర్వే నిర్వహించి వివరాలు సమర్పించాలని ఈ సందర్భంగా మంత్రి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ఆదేశించారు.

అనంతరం మంత్రి, దాజితో కలిసి బుద్ధవనం పక్కన ఉన్న విపస్యన ధ్యాన కేంద్రం పరిసర ప్రాంతాలను, ఇతర ప్రదేశాలను పరిశీలించారు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే జయవీర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... నాగార్జున సాగర్ ను అభివృద్ధి చేసేందుకు, ప్రత్యేకించి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ తరపున చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బుద్ధవనం చూడడానికి ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి ఆసియా దేశాల నుంచి ఎంతోమంది భౌద్ధులు ,ఇతరులు వస్తున్నారన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా సౌకర్యాలను కల్పించేందుకు, ముఖ్యంగా బుద్ధవనం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో స్టార్ హోటల్ నిర్మాణం, నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లో వాటర్ స్పోర్ట్స్‌ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ సమీపంలో ఉన్న రామచంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దాజితో కలిసి సందర్శించినట్లు తెలిపారు.

స్టార్ హోటల్, వాటర్ స్పోర్ట్స్ తో పాటు, ఈ ప్రాంతంలో అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా కాటేజీల నిర్మాణాన్ని చేపట్టనున్నామని, నాగార్జునసాగర్ తో పాటు, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం పెద్ద ఎత్తున టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. అంతకుముందు విజయ్ విహార్ లో స్థానిక ఎమ్మెల్యే జయవీర్ మాట్లాడుతూ, నాగార్జునసాగర్ ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని, ప్రత్యేకంగా కృష్ణా నది సమీపంలో ఉండటం ,కొండలు ,ఇక్కడ పరిసరాలు ,బుద్ధవనం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు మంచి ఆస్కారం ఉందన్నారు .రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎం డి ప్రకాష్ రెడ్డి, ఓఎస్ డి. సుధన్ రెడ్డి, బుద్ధిష్ట్ కన్సల్టెంట్ శివనాగిరెడ్డి, బుద్ధవనం డిజైనర్, ఇంచార్జ్ శ్యాంసుందర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ తదితరులు ఉన్నారు. అనంతరం మంత్రి బుద్ధవనం సందర్శించారు. బుద్దిస్ట్ కన్సల్టెంట్ శివ నాగిరెడ్డి బుద్ధవనం విశేశాలను మంత్రికి వివరించారు.


Similar News