రోజూ వందల మంది పేషెంట్లు.. ఒక్కడే డాక్టర్

Update: 2024-08-24 10:48 GMT

దిశ, హాలియాః రోజూ వందల మంది పేషెంట్లు వస్తున్నారు. కానీ ఒక్కడే డాక్టర్ ఉన్నాడు. సేవలు అందించలేక డాక్టర్ ఇబ్బంది పడుతున్నాడు. వైద్యం అందక పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. హాలియా మున్సిపాలిటీలో 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమస్యలు జటిలంగా మారాయి. గతంలో ఆరోగ్య కేంద్రం లో 20 నుండి 30 మందికి మించని ఓపి సేవలు నేడు రోజుకు వంద మందికి పైగా వస్తుండడంతో ఆరోగ్య కేంద్రంలో కనీస వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధులైనటువంటి టైఫాయిడ్, మలేరియా,, డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ తదితర ఆరోగ్యపరీక్షల కోసం ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లలో రూ.వేలాది రూపాయలను వసూలు చేస్తున్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 పోస్టుల ఖాళీలు

హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో రోగులకు వైద్య సేవలు అందించలేని పరిస్థితి నెలకొంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వివిధ విభాగాల్లో 24 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా అదనపు వైద్యుడు స్టాఫ్ నర్స్ ఏఎన్ఎం-1 లో నాలుగు పోస్టులు ఏఎన్ఎం-2 లో రెండు పోస్టులు ఈసీ ఏఎన్ఎం లో మూడు పోస్టులు తదితర పోస్టులతో పాటు వార్డ్ బాయ్స్ హెల్పర్లు వివిధ విభాగాల్లో మరో 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీజనల్ వ్యాధులు వస్తుండడంతో హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు 30 నుండి 40 మంది ఇన్ పేషెంట్లుగా చేరే పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ఇక్కడ కేవలం ఎనిమిది బెడ్లు మాత్రమే ఉండడంతో ఇన్ పేషంట్ల సంఖ్యను తగ్గించుకునే పనిలో వైద్యులు ఉన్నారు.

స్టేట్ హెల్త్ డైరెక్టర్ దృష్టికి సమస్యలు

హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా వివిధ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో గతవారం హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ దృష్టికి ఆరోగ్య కేంద్రంలో ఖాళీల సమస్య ను స్థానిక నాయకులు తీసుకెళ్లారు. గత కొన్ని నీళ్లు గా ఆరోగ్య కేంద్రంలో వివిధ విభాగాల్లో పోస్టుల అవసరం ఉన్నప్పటికీ ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక నాయకులు రవీందర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవలపై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన విషయం తెలిసిందే.

ఓపి సేవలు అందిస్తూనే ఉన్నాం...

రామకృష్ణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి

సీజనల్ వ్యాధుల కారణంగా హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నిత్యం వందమందికి పైగానే ఓపి వస్తుంది. అయినప్పటికీ ఉన్న స్టాఫ్ తోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తూనే ఉన్నాం. ఆస్పత్రిలో తాత్కాలిక ఇన్ పేషెంట్ సేవలతో పాటు ల్యాబ్ ఫార్మసీ తదితర సేవలను అందిస్తున్నాం.

Tags:    

Similar News