ఆదమరిచారా.. అంతే సంగతి..!

భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రం నుండి జగత్ పల్లి వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న వ్యవసాయ బావి ప్రమాదకరంగా ఉంది.

Update: 2024-12-25 08:15 GMT

దిశ, భూదాన్ పోచంపల్లి : భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రం నుండి జగత్ పల్లి వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న వ్యవసాయ బావి ప్రమాదకరంగా ఉంది. నిత్యం ఈ దారి వెంట వాహనదారులు, వ్యవసాయ కూలీలు, వివిధ గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రాకపోకలు నిర్వహిస్తుంటారు. అసలే ఇరుకు రోడ్డు.. అందులో మూలమలుపు. ఈ బావి మూలమలుపు పై ఉండడంతో అటుగా వెళ్లే ప్రయాణికులకు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక బావిలో పడే అవకాశాలు అనేకంగా ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి వేళలో ఈ దారి వెంట ప్రయాణించాలంటే కత్తి మీద సాము లాంటిదేనని చెప్పొచ్చు.

ఈ బావి రోడ్డుకు అతి దగ్గరగా ఉండడంతో హెచ్చరిక బోర్డులు కూడా లేకపోవడం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. గతంలో ఆ మూలమలుపు పై ప్రమాదాలు జరిగినప్పుడు అప్పటి అధికారులు స్పందించి నామమాత్రంగా తాత్కాలికంగా హెచ్చరిక ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ఈదురు గాలులతో కురిసిన వర్షానికి ఆ ఫ్లెక్సీ కనిపించక సమస్య మళ్లీ మొదటికే వచ్చింది. ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణం పోతే కానీ పట్టించుకోరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి శాశ్వతంగా సమస్య పరిష్కారమయ్యేలా హెచ్చరిక బోర్డులను, రక్షణ గోడ లేదా ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.. ఇట్టమోని మహేష్ యాదవ్, జగత్పల్లి వాసి

జగత్ పల్లి నుండి పోచంపల్లి కి వెళ్లేందుకు ఇదే ప్రధాన దారి కావడంతో నిత్యం రాకపోకలు నిర్వహిస్తుంటాం. ఈ దారి వెంట ప్రయాణించాలంటే ప్రాణం అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళలో ఈ దారి వెంట వెళ్లలేని పరిస్థితి. అసలే చిమ్మ చీకటి, అందులో మూలమలుపు, దానికి అనుకొని వ్యవసాయ బావి. గతంలో అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇటీవల కలెక్టర్ హనుమంతరావు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించేందుకు గ్రామానికి వచ్చినప్పుడు వ్యవసాయ బావి ప్రమాదకరంగా ఉందని చెప్పడంతో ఫెన్సింగ్ గోడను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయినా అధికారులు మాత్రం తమకేమీ పట్టింపు లేనట్లు వ్యవహరిస్తున్నారని, తక్షణమే అధికారులు స్పందించి శాశ్వతంగా సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఫెన్సింగ్ గోడను ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.


Similar News