MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు
కాంగ్రెస్ పార్టీ కీలక నేత, నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదైంది. చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ ఫిర్యాదు మేరకు నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై నల్గొండ పీఎస్‌లో కేసు నమోదైంది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌కు బెదిరింపులపై ఆయన కొడుకు సుహాస్ సోమవారం నల్గొండ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సుహాస్ ఫిర్యాదు మేరకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై నల్గొండ వన్‌టౌన్ పీఎస్‌లో ఐపీసీ సెక్షన్ 506 కింద కేసు నమోదైంది. తన తండ్రి సుధాకర్‌ని చంపుతానంటూ కోమటిరెడ్డి ఫోన్‌లో బెదిరించాడని చెరుకు సుహాస్ ఫిర్యాదు చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, చెరుకు సుధాకర్ కొడుకు సుహాస్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు.
తనపై విమర్శలు మానుకోవాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తన అభిమానులు, కార్యకర్తలు చెరుకు సుధాకర్‌ను చంపేందుకు 100 కార్లలో తిరుగుతున్నారని బెదిరించిన ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆడియో సంభాషణపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిన్న వివరణ ఇచ్చారు. భావోద్వేగంతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా వెంకట్‌రెడ్డి చెప్పారు. ఈ విషయానికి ఇప్పటితో పుల్‌స్టాప్ పెట్టాలని ఆయన చెరుకు సుధాకర్‌ను కోరారు. తన కొడుకుకు ఫోన్ చేసి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడడంపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘానికి చెరుకు సుధాకర్ నిన్న ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం టీకాంగ్రెస్‌లో దుమారం రేపుతోంది.