బెల్ట్ షాపుల నిర్మూలనతో తగ్గిన క్రైమ్ రేట్.. నారాయణపురం ఎస్సై

మండల పరిధిలో ఒకప్పుడు కిరాణం షాపులలో కూల్ డ్రింకులు దొరికినట్లు ఎనీ టైం మద్యం అందుబాటులో ఉండేది.

Update: 2024-12-14 04:32 GMT

దిశ, సంస్థాన్ నారాయణపురం : మండల పరిధిలో ఒకప్పుడు కిరాణం షాపులలో కూల్ డ్రింకులు దొరికినట్లు ఎనీ టైం మద్యం అందుబాటులో ఉండేది. కానీ ఇటీవల మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తిగా బెల్టు షాపులను నిర్మూలించాలని ఆయన కంకణం కట్టుకున్నారు. దీంతో ఎక్సైజ్, పోలీస్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి మరి సీరియస్ గా ఆదేశాలు జారీ చేశారు. బెల్ట్ షాపుల వెనుక ఎంతటి వారు ఉన్న ఉపేక్షించకూడదని ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం అమ్మకాలు నిర్వహించే వారి పై కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. దీంతో మండలంలో సుమారు 200 నుండి 300 పైగా గతంలో ఉన్న బెల్టు షాపులను నిర్మూలించడంలో పోలీసులు రాత్రింబవళ్లు శ్రమించారన్నారు నారాయణపురం ఎస్ఐ. మొదట పట్టుబడిన వారిని మరోసారి పట్టుబడితే కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరించి వదిలేశారని తెలిపారు. అయినా కూడా తిరిగి మళ్లీ పట్టుబడితే వారికి బైండోవర్ తో పాటు భారీ జరిమానాలను విధించారు. దీంతో భయపడిన బెల్ట్ షాప్ నిర్వాహకులు మద్యం అమ్మకాలను నిలిపివేశారన్నారు.

తగ్గిన క్రైమ్ రేట్...

బెల్ట్ షాపుల నిర్మూలనతో మండలంలో చాలావరకు క్రైమ్ రేట్ తగ్గినట్లు తెలుస్తుందన్నారు. అర్ధరాత్రి సమయాలలో కూడా కిరాణా షాపుల్లో మద్యం దొరకడంతో మద్యం మత్తులో యువకులు గొడవలకు దిగడంతో పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయన్నారు. అంతేకాకుండా అర్ధరాత్రి సమయాలలో మద్యం సేవించి గొడవలకు దిగి హత్యాయత్నం చేసేంత వరకు కూడా కేసులు వెళ్లడంతో తల్లిదండ్రులు అనుభవించిన క్షోభ అంతా ఇంతా కాదన్నారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా కృంగిపోయారన్నారు. తాజాగా బెల్ట్ షాపుల నిర్మూలనతో యువకుల తల్లిదండ్రులకు కూడా కాస్తంత ఉపశమనం లభించిందనే చెప్పాలి అంటున్నారు. సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్లో 2023 సంవత్సరంలో 52 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 37 కేసులే నమోదు అవ్వడం ఇందుకు ఉదాహరణ అని తెలిపారు.

సంతోషంగా ఉన్న గృహిణులు..

ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏ చిన్నపాటి గొడవ జరిగినా వెంటనే భర్తలు అర్ధరాత్రి సమయాలలో కూడా బెల్ట్ షాపులకు వెళ్లి మద్యం సేవించి మద్యం మత్తులో ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు కూడా చాలానే ఉన్నాయన్నారు నారాయణపురం ఎస్ఐ. ఎప్పుడు పడితే అప్పుడు మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యలతో గొడవ పడితే భార్యలు కూడా ఆ పోరును భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఈ సంఘటనలన్నిటిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి మహిళలు తీసుకువెళ్లడం ఆయన కూడా వీటిని సీరియస్ గా తీసుకోవడంతో బెల్ట్ షాపుల నిర్మూలన సాధ్యమైందన్నారు. బెల్ట్ షాపుల పై కఠినంగా వ్యవహరిస్తేనే పోలీసు అధికారులకు పోస్టింగులు ఉంటాయి అనే స్థాయి ప్రచారం జరగడం దీని పై ఎమ్మెల్యే ఏ స్థాయిలో సీరియస్ గా ఉన్నారో ఇట్లే అర్థమైపోతుంది. దీంతో దీనిని పట్టుదలగా తీసుకున్న పోలీసు,ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్ట్ షాపుల నిర్మూలనకు పూనుకున్నారు. బెల్ట్ షాపుల నిర్మూలనతో మండల పరిధిలోని గృహిణులు కూడా సంతోషంగా ఉండడమే కాకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషితోనే సాధ్యమైందని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా బెల్ట్ షాపుల నిర్మూలనకు ఇంతే కఠినంగా వ్యవహరిస్తే క్రైమ్ రేట్ తగ్గుతుందనేది మేధావుల విశ్లేషణ.

బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించాం : జే.జగన్ నారాయణపురం ఎస్ఐ.

మండల పరిధిలో బెల్ట్ షాపు నిర్వాహకుల పై వరుస దాడులు నిర్వహించి కఠినంగా వ్యవహరించాం. ఎమ్మెల్యే ఆదేశాలతో ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా కేసులు నమోదు చేశాం. దీంతో మండల వ్యాప్తంగా బెల్ట్ షాపులు నిర్వహించాలంటేనే భయం కలిగేలా చేశాం. బెల్ట్ షాప్ నిర్వాహకులు కూడా భవిష్యత్తులో ఇలాగే సహకరించి నేర రహిత మండలంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేరాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.


Similar News