బీజేపీ, బీఆర్ఎస్ దొందూ దొందే..
తెలంగాణ రాష్ర్టంలో బీఆర్ఎస్, బీజేపీ దొందూ దొందేనని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ర్టంలో బీఆర్ఎస్, బీజేపీ దొందూ దొందేనని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు.నువ్వు తన్నినట్లు చెయ్.. నేనే ఏడ్చినట్లు చేస్తా అనే తీరుగా ఆ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇక రాష్ట్రంలో సీపీఎం, సీపీఐ నేతలు బకరాల్లా మారారని అన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ యాత్రలో పాల్గొన్న సీతక్క.. నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. దేశంలో ఆకలి చావులకు మోడీ ప్రభుత్వ విధానాలే కారణమని చెప్పారు. అదానీ, అంబానీలకు దేశాన్ని దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోడీ, అదానీ బంధాన్ని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీపై ఈడీ దాడులు చేయిస్తున్నారని, రాజద్రోహం కేసు పేరుతో వేధిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అదే పరిస్థితి నెలకొందని, ప్రశ్నించినవాళ్లను కేసీఆర్ జైలుకు పంపుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉంటే కేసీఆర్ పాలనలో రూ.4 లక్షల కోట్ల అప్పు అయ్యిందని చెప్పారు. లిక్కర్ స్కాం గురించి మాట్లాడితే తెలంగాణ కు అవమానం జరిగిందంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి ప్రజల్లో ఉంటూ వారి కష్ట సుఖాలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టిని అశిర్వదించాలని కోరారు. ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టి సంక్షేమ పథకాలను అమలు చేసిందని ఇప్పుడు కుడా అమలు చేస్తుందని అన్నారు.