సీఎం రేవంత్ రెడ్డితో MP ఆర్.కృష్ణయ్య భేటీ.. కారణమిదే!
రాజ్యసభ సభ్యుడు, బీసీ నేత ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎంతో మర్యాదపూర్వక భేటీ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ సభ్యుడు, బీసీ నేత ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎంతో మర్యాదపూర్వక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీసీల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎంను కోరినట్లు సమాచారం. కాగా, ఇటీవలే మంత్రివర్గ విస్తరణలో ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు ఐదు మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనేక వాగ్దానాలు చేసిందని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఈ వాగ్దానాలు అమలు చేస్తారనే నమ్మకం కలిగిందని ఆశాభావాన్ని కృష్ణయ్య వ్యక్తం చేశారు.
గత మంత్రివర్గ నిర్మాణంలో బీసీల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని.. వచ్చే విస్తరణలో బీసీలకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నానన్నారు. త్వరలో భర్తీ చేయబోయే కార్పొరేషన్‌లు, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలలో ఇతర నామినేటెడ్ పోస్టులలో బీసీలకు జనాభా దమాషా ప్రకారం 50 శాతం పదవులు ఇవ్వాలని కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇవాళ్టి భేటీలో వీటిపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్.కృష్ణయ్య ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.