KCR సిట్టింగులకే టికెట్ అన్నాడు.. మరీ వారి పరిస్థితేంటి..? కవితకు MP అర్వింద్ కౌంటర్
ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకే టికెట్లు అన్నాడని, మరి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తాడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకే టికెట్లు అన్నాడని, మరి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తాడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు.ఢిల్లీలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత 33 మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీలో దీక్ష చేశారని, మరి ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్‌లో ఎంతమందికి 33 శాతం ఇచ్చారో ముందు చూపించాలని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌తో ముందు 33 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయించి తర్వాత కేంద్రానికి రావాలని ఆయన సూచించారు. గురువారం కవిత విచారణ ఢిల్లీలో ఉందని, ఈసారి కూడా మొత్తం కేబినెట్ వేసుకొని మంత్రి కేటీఆర్ వస్తారేమోనని ఎద్దేవాచేశారు.
తెలంగాణ మంత్రులకు తాను మళ్లీ మళ్లీ చెబుతన్నానని, ఊరికే ఢిల్లీకి రావొద్దని ఆయన సూచించారు. విమానాశ్రయంలో ఫేషియల్ రికగ్నైజ్ టెక్నాలజీ ఉందని, అవన్నీ ఎవరెవరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో నమోదవుతుందన్నారు. ఇదిలా ఉండగా మీడియా సంస్థలని బ్యాన్ చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించడంపై ఆయన మండిపడ్డారు. ఇది బీఆర్ఎస్ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. త్వరలోనే బీఆర్ఎస్ నేతలను రాష్ట్ర ప్రజలు బ్యాన్ చేయడం కన్ఫామ్ అని ఆయన చురకలంటించారు. మంత్రి కేటీఆర్‌కి సంతోష్ జీ అంటే ఎవరో తెలుసా అని అర్వింద్ ప్రశ్నించారు.
మంత్రి కేటీఆర్ కన్నా సంతోష్ జీ బాగా చదువుకున్నాడని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కోర్టుకు వెళ్లి సంతోష్‌జీ ఆర్డర్ తెచ్చుకున్నాడని కేటీఆర్ గతంలో అన్నారని, మరి కవిత కోర్టుకు ఎందుకు వెళ్ళిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టుకు వెళ్ళడం రాజ్యాంగం కల్పించిన హక్కుగా ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. మంత్రి కేటీఆర్ ఈ తొమ్మిదేండ్లలో భారీగా ఆస్తులు సంపాదించుకున్నారని ధర్మపురి అర్వింద్ ఆరోపణలు చేశారు.
Also Read..