బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవదానం: MP చామల ఫైర్

బీఆర్ఎస్ సచ్చి బీజేపీకి అవయవదానం చేసిందని ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి విమర్శించారు.

Update: 2024-07-13 17:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ సచ్చి బీజేపీకి అవయవదానం చేసిందని ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారన్నారు. బీజేపీలోకి ఆ పార్టీ విలీనం కాబోతున్నదన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీతో అనుసరించిన వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు బీజేపీ సిద్ధమైందన్నారు. టీడీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు బీజేపీలో చేరారన్నారు. బీజేపీ అంత ద్రోహం చేసినా, గత ఎన్నికల్లో టీడీపీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నదన్నారు.

ఇప్పుడు ఇదే విధానం తెలంగాణలో అమలు చేయబోతున్నారని వెల్లడించారు. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ఎంపీలను కేసీఆరే స్వయంగా బీజేపీలోకి పంపించబోతున్నాడన్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని, వీలుకాకపోతే పొత్తు పెట్టుకుంటుందన్నారు. ఇదంతా బిడ్డ బెయిల్ కోసం మోదీ కాళ్లు పట్టుకోవడానికి కేసీఆర్ చేస్తున్న ప్లాన్ అని వివరించారు. ఈ మేరకు ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్​రావులు ఢిల్లీలో చర్చలు జరిపారని, సఫలమైనట్లు ప్రాథమిక సమాచారం ఉన్నదన్నారు. తెలంగాణలో నడిరోడ్డు పైన రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని, ఈ దేశంలో రాజ్యాంగాన్ని కించపరుస్తుంది..? ఎవరో..? అందరికీ తెలుసునని చెప్పారు.

పదేళ్లలో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటైన 10 ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీదన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఇవన్నీ కనిపించలేదా..? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వాలను కూల్చిన అంశంలో సుప్రీం కోర్టుతో చివాట్లు తిన్న చరిత్ర బీజేపీదన్నారు. ఈడీ, సీబీఐ, ఇన్ కమ్ ట్యాక్స్ వంటి సంస్థలతో బెదిరించి ఎమ్మెల్యేలను చేర్చుకుని ప్రభుత్వాలను కూల్చేసిన బతుకులు బీజేపీవని విమర్శించారు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఫిరాయింపులపై నీతులు చెప్పడం విచిత్రంగా ఉన్నదన్నారు.

నాలుగు రోజుల క్రితమే మధ్య ప్రదేశ్ బీజేపీ మంత్రి వర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేని చేర్చుకున్నారన్నారు. ఆరు సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రామ్ నివాస్ రావత్‌ను జులై 9న సీఎం మోహన్ యాదవ్ తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారన్నారు. విజయ్ పూర్ నుంచి రావత్ కాంగ్రెస్ నుంచి గెలిచారని, ఇప్పటి వరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి ప్రకారం అప్పుడు మధ్యప్రదేశ్‌లో కూడా రాజ్యాంగ అవహేళనే కదా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక 2014 లో టీడీపీ ఎమ్మెల్యే తలసాని, 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కేసీఆర్ తన మంత్రి వర్గంలో చేర్చుకున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌కు మధ్య ఉన్న తేడా ఏమిటీ..? ఈ రెండు పార్టీల డీఎన్ఏ ఒకటేననే విషయం అర్థం కావడం లేదా..? అంటూ వెల్లడించారు. అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్‌లు.. కవల పిల్లలా బాగా కలిసిపోయారని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లా కలిసిపోయాయని చెప్పారు. సికింద్రాబాద్‌లో ఎలా గెలిచాడో కిషన్ రెడ్డికీ స్పష్టంగా తెలుసు అన్నారు.


Similar News