Chamala Kiran Kumar: కేసీఆర్ ఫామ్ హౌస్ అయినా దాటాడా?.. రేవంత్ విదేశీ టూర్ పై విమర్శలొద్దు: చామల
కాంగ్రెస్ ను బద్నాం చేయడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుందని చామల ధ్వజమెత్తారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ కుటుంబ రాజకీయాలను గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ వచ్చాక నిరుద్యోగులకు ఏమి చేయని కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ధ్వజమెత్తారు. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చామల.. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్తే దాన్ని కూడా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం టూర్ అంతా పారదర్శకంగా జరుగుతున్నదని, ముఖ్యమంత్రి బృందంలో ఉన్న అధికారులు గతంలో బీఆర్ఎస్ హయంలో కేటీఆర్ వెంట విదేశాలకు వెళ్లిన వారేనని చెప్పారు. కాంగ్రెస్ ను ఎలా బద్నాం చేయాలనే ఆలోచనతోనే మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి బీఆర్ఎస్ ముందుకు వెళ్తున్నదని.. ఆ పార్టీ నేతలు ప్రజలను మాయమాటలు చెప్పి తప్పదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ ఎన్ని సార్లు విదేశాలకు వెళ్లారు? ఎన్ని కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారు? ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారో బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీతో సెట్ చేసుకుని వెళ్తే బెటర్..
గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ దాటిపోలేదని.. సింగపూర్, చైనాకు మాత్రం హాలిడేస్ కోసం వెళ్లారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మాత్రం పదవిలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు రెండు సార్లు విదేశాల్లో పర్యటించారన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లిన తొలి ముఖ్యంత్రి రేవంత్ రెడ్డినే అన్నారు. తక్కువ వడ్డీలకు అప్పులిచ్చే ప్రపంచ బ్యాంకు వంటి వనరులు ఉన్నా వాటిని వాడుకోకుండా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. గంజాయి, చీప్ లిక్కర్, డ్రగ్స్ మినహా అన్ని వ్యాపారులకు అనుమతులు ఇస్తామని, కేటీఆర్ బావ మరిది, కవిత భర్త అయినా పార్టీలు, వ్యక్తులతో సంబంధం లేకుండా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామంటే ఆహ్వానిస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వడం, సంపద సృష్టించడమే మా లక్ష్యం అన్నారు. బీఆర్ఎస్ లో కొంత మంది భజన బ్యాచ్ ఉందని, సోషల్ మీడియాలో ఏదైనా పెట్టకపోతే వారికి బతుకుదెరువు లేదని ఘాటు విమర్శలు చేశారు. కొంత మంది మాజీ ఎమ్మెల్యేలు కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేసేందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు వారం రోజులుగా ఢిల్లీకి వచ్చి బీజేపీ పెద్దలతో సంప్రదింపులు చేసుకుని సెట్ అయితే బెటర్ అన్నారు. బెయిల్ కోసం వారం రోజులుగా ఢిల్లీ ఎవరూ ఉండరని బీజేపీకి, బీఆర్ఎస్ కు మధ్య ఎదో జరుగుతున్నదని అనుమానం వ్యక్తం చేశారు. రైతురుణమాఫీ కావడం లేదన్న కిషన్ రెడ్డికి కళ్లు కనిపించడం లేదా అని విమర్శించారు.