డీకే అరుణ అరెస్ట్ అక్రమం.. KCR సర్కార్‌కు ప్రజలే కర్రుకాల్చి వాత పెడతారు: బండి ఫైర్
నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గత నాలుగు రోజులుగా అమరణ నిరహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గత నాలుగు రోజులుగా అమరణ నిరహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, ఏలేటి మహేశ్వర్ రెడ్డి దీక్షకు మద్దతు తెలిపేందుకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇవాళ నిర్మల్ వెళ్తుండగా.. పోలీసులు ఆమెను ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద అడ్డుకుని అరెస్ట్ చేశారు. డీకే అరుణ అరెస్ట్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అరెస్ట్ అక్రమమని పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న అరుణను అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించడం దుర్మార్గామన్నారు. నిరసన దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళ్తే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నియంత పోకడలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని.. కేసీఆర్ సర్కార్‌కు ప్రజలే కర్రుకాల్చి వాత పెడతారని హెచ్చరించారు.